అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓ పరీక్షలా మారింది. అధినేత దృష్టిని ఆకర్షించేలా ప్రజాప్రతినిధులు జనసమీకరణకు తంటాలు పడుతున్నారు. సభ అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండటంతో జనసమీకరణపై ప్రత్యేక దృష్టిసారించారు నేతలు. ఒకరిని మించి మరొకరు జనాలను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సెప్టెంబరు 2న కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది అధికార పార్టీ. దాదాపు 25లక్షల మందితో సభను జరిపి చరిత్ర సృష్టించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ కృషి చేస్తోంది. ఈ సభను సక్సెస్ చేయాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దీంతో నేతలంతా జనసమీకరణపై దృష్టిసారించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఒక్కో నియోజకవర్గం నుంచి 20 నుంచి 25వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌కు సమీపంగా ఉండే కామారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి ఎక్కువ సంఖ్యలో జనాన్ని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఐదు నియోజకవర్గాల నుంచి 550 ఆర్టీసీ బస్సులతోపాటు వెయ్యి ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు.
జనసమీకరణకు జిల్లా ఇన్‌చార్జిగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తుండగా సమన్వయకర్తగా మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డిని నియమించారు. ఈ ఇద్దరి పర్యవేక్షణలో జనసమీకరణ జరుగుతోంది. ఒకరిద్దరి టికెట్లలో మార్పు ఉంటుందని అధినేత సంకేతాలివ్వడంతో సభ సక్సెస్ కోసం ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. భారమైనా అధినేత దృష్టిని ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే, పైకి మాత్రం కొంగర కలాన్ సభ చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రగతి నివేదన సభ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అగ్నిపరీక్షలా మారింది. మరి భారీ జన సమీకరణతో అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు వీరి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.