టిక్కెట్ల కేటాయింపుపై తీవ్ర ఆందోళన...శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇవ్వాలని..
టీఆర్‌ఎస్‌లో టిక్కెట్లపై అసమ్మతి కుంపటి మొదలైంది. ఏకంగా కొందరు తిరుగుబాటు అభ్యర్థులు సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెడుతున్నారు. మరికొంరు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. అసమ్మతి సెగలు కారు పార్టీకి ఎందుకు కమ్ముకుంటున్నాయి?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టిక్కెట్ల కేటాయింపుపై అసమ్మతి జ్వాల రగులుతోంది. కొందరు అభ్యర్థులు సిట్టింగ్‌లకు టిక్కెట్ రాదని తమకు సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా టిక్కెట్ల కేటాయింపు అసమ్మతి నాయకులు తీవ్ర అందోళన చెందుతున్నారు. కొందరు తమ దారి తాము చూసుకుంటున్నారు. మంచిర్యాల టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్‌రావుకు కేటాయించారు. స్థానిక ఎంపీపీ సత్యనారయణ ఈ టిక్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సీను తిరగబడటతో సత్యనారాయణ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు.
మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఖానాపూర్ టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కేటాయించడంతో రాథోడ్ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. టిక్కెట్ వస్తుందనే రాథోడ్ టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు కానీ టిక్కెట్ కేటాయింపులో మొండిచేయి చూపడంతో మంత్రి తుమ్మలతో రాథోడ్ చర్చలు జరిపారు. కాని స్పష్టమైనా హామీ రాకపోవడంతో ఆయనిప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయన అనుచరులంటున్నారు.
మరోవైపు చెన్నూరు టిక్కెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని నల్లాల ఓదేలు వాపోతున్నారు. తనను ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీ చేస్తామని పార్టీ అధినాయకత్వం హామీనివ్వడంపై ఆయన అంసతృప్తిగా ఉన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓదేలుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు కూడా భగ్గుమంటున్నారు. ఆయనకు మద్దతుగా ఓ అనుచరడు సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. సిట్టింగ్‌ను కాదని స్థానికేతరుడైన బాల్క సుమన్ ఎలా టిక్కెట్ కేటాయిస్తారని కార్యకర్తలు ప్రశిస్తున్నారు.
అటు హజూర్‌నగర్ నుంచి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టిక్కెట్ కేటాయించాలని ఎల్‌బీనగర్‌లో సెల్‌టవర్ ఎక్కారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లికి టిక్కెట్ కేటాయించే వరకూ టవర్ దిగనంటూ హల్‌చల్ చేశాడు. ఏమైనా కారు పార్టీలో అసమ్మతి రోజురోజుకు పెరుగుతుండటంతో పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. మూడు నియోజకవర్గాలలో తగ్గించకుంటే మరింత విస్తృతమయ్యే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు. మరి అసమ్మతి నాయకులను బుజ్జగించడానికి అధిష్ఠానం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.