తాత్కాలిక ఆనందం కోసం వేదమంత్రాలు సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తలనే భార్యలు కడతేరుస్తున్నారు. ప్రియుడు మోజులో పడి చేసిన బాసలు మరచిపోతున్నారు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కర్కశంగా చంపేస్తున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు, పిల్లలకు దూరమై పోతున్నారు.
భర్త చేతిలో భార్య హత్య నిన్నటి మాట. ఇప్పుడంతా భార్య చేతిలో భర్త హతం వార్తలే వినిపిస్తున్నాయి. భర్తలను చంపిన భార్యల జాబితా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలా పెద్దదే అవుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో స్వాతి, హైదరాబాద్‌లో జ్యోతి, పద్మలు, గుంటూరు జిల్లాలో శ్రీవిద్య, విజయనగరం జిల్లాలో సరస్వతిలు భర్తలను చంపిన భార్యలుగా మీడియాలో ప్రచారం పొందారు. కుటుంబ సంబంధాలలో ఉంటూ పిల్లల విషయంలో ప్రేమమూర్తులైన భార్యలలో అమానవీయత పెరిగిపోతోంది. భర్త బాగుండాలంటూ నిత్యం మంగళ సూత్రాలను కళ్ళకద్దుకునే స్త్రీ మనసు ఆ భర్తనే చంపాలనుకునే స్ధితికి దిగజారిపోతోంది.
ఇలాంటి ఘటనలో పిల్లల్లో మానసిక స్థితి పూర్తిగా మారిపోతుందని సైక్రియాటిస్టులు చెబుతున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా మహిళలు భర్తలను చంపేసి కడుపున పుట్టిన పిల్లలు, తల్లిదండ్రులకు దూరమవుతున్నారని తెలిపారు. తల్లి జైలు పాలు కావడం తండ్రి చనిపోవడంతో పిల్లల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఇటివల కాలంలో భార్య, భర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడం సరైంది కాదని మహిళా సంఘాల నేతలు చెబుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంతోనే నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. అటు అమ్మాయిలు కూడా భర్తలను భార్యలు చంపడం మంచిది కాదంటున్నారు.
భర్తల అడ్డు తొలగించుకునేందుకు భార్యలే మాస్టర్ స్కెచ్ వేసి ప్రియుళ్లకు దారి చూపిస్తున్నారు. కడదాకా తోడుండే భర్తను కాలదన్నుకుని చంపేసేంత కర్కశత్వం మహిళల్లో పెరుగుతోంది. తాత్కాలిక సుఖాల కోసం కుటుంబాన్ని ఎందుకు చిన్నాభిన్న చేసుకుంటున్నారు? ఆ తరువాత పిల్లల భవిష్యత్ ఏమిటి ? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.