తెలంగాణ గట్టు... పొత్తు మీద పొత్తు కట్టు!!

Update: 2018-09-10 06:03 GMT

తెలంగాణ గట్టుమీద సరికొత్త పొత్తుల ప్రస్తానం. దశాబ్దాల ప్రత్యర్థుల మధ్య చిగురిస్తున్న స్నేహం. ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల దగ్గర, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారన్న ఆవేశంతో, ఆవిర్భవించిన తెలుగుదేశం, తిరిగి అదే పార్టీతో చేయి కలుపుతుందన్న వార్తలు, సంచలనం సృష్టిస్తున్నాయి. కేసీఆర్‌-మోడీ ఒకే జట్టని విమర్శిస్తున్న బాబు, కాంగ్రెస్‌తో చేయి కలిపి, వారి జోడిని ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు అర్థమవుతోంది. పొత్తు కోసం ఆహ్వానమన్న కాంగ్రెస్‌ ఆఫర్‌పై చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో టీటీటీడీ నేతలతో సమావేశమైన బాబు, పొత్తులుంటాయని, అందరూ కట్టుబడి ఉండాలన్న సంకేతాలిచ్చినట్టు అర్థమవుతోంది. 

కాంగ్రెస్‌తో పొత్తుంటుందని డైరెక్టుగా చెప్పలేదు. కానీ రాజకీయ నిర్ణయాలకు రెడీగా ఉండాలని సిగ్నల్స్ ఇచ్చారు బాబు. మీ ఇష్టం, ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోండని, తెలంగాణ తమ్ముళ్లకు స్వేచ్చనిచ్చారు. అందరికీ సీట్లు రాకపోవచ్చని, త్యాగాలకు సిద్దపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి, కష్టపడాలన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు, కాంగ్రెస్‌తో పొత్తుంటుందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, తెలుగుదేశం ఆవిర్భవించింది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో జట్టుకట్టాలని భావిస్తోంది. అసలు టీడీపీ ఆవిర్భావ సమయంలోనూ, పొత్తుల ఎత్తులు నడిచాయి. మేనకా గాంధీ నేతృత్వంలోని సంజయ్‌ విచార్ మంచ్‌తో, తొలిసారి జట్టుకట్టారు ఎన్టీఆర్. 

ఇక కూటములు కట్టడంలో చంద్రబాబు చాణక్యమే వేరు. అన్ని పార్టీల అధినేతలతో పరిచయాలు, రాజకీయ అనుభవాన్ని రంగరించడం, అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తేవడంలో నేర్పరిగా బాబుకు పేరుంది. ఎన్ని కూటములు కట్టినా, ఎన్టీఆర్‌, చంద్రబాబు ఫైట్‌ చేసింది మాత్రం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే. దశాబ్దాలుగా కాంగ్రెస్‌పైనే పోరాటం చేశారు. కానీ రాష్ట్ర విభజనతో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయమే మారిపోయింది. సమీకరణలు సమూలంగా మారాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరన్న మాటకు మరోసారి నిదర్శనంగా ఇప్పుడు అదే బద్ద శత్రువు కాంగ్రెస్‌తోనే, జట్టుకడుతోంది తెలుగుదేశం. మోడీ వ్యతిరేక పక్షాల ఏకీకరణకు పిలుపునిస్తున్న చంద్రబాబు, తెలంగాణ ఎన్నికలతోనే శ్రీకారం చుట్టబోతున్నారు. కాంగ్రెస్‌తో జట్టుకట్టి, తెలుగుదేశం ప్రస్థానంలో సరికొత్త పొత్తుల అధ్యాయాన్ని లిఖించబోతున్నారు.

Similar News