ఎన్నికల వేళ మరోసారి ఎన్టీఆర్‌నే నమ్ముకుంది టీటీడీపీ. అన్నగారిని ఎన్నికల ప్రచారంలోకి దించాలని భావిస్తోంది. తెలంగాణలో తారక రామునికి అభిమానాలు లెక్కకు మిక్కిలిగా ఉండటం..ఓ సామాజిక వర్గ ఓటర్లు ఎన్టీఆర్‌కు వీరాభిమానులుగా ఉండటంతో, అది తమకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. అయితే ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌లో బిజిబిజీగా ఉన్న బాలకృష్ణను, అన్నగారి గెటప్‌లోనే ఎన్నికల రణక్షేత్రంలోకి దింపాలని ప్రయత్నిస్తోంది తెలుగుదేశం.
టీటీడీపీకి ఈ ఎన్నికలు జీవన్మరణం. క్షేత్రస్థాయిలో క్యాడర్ చెక్కుచెదరకపోయినా, బలమైన లీడర్లు చెదిరిపోవడంతో నిస్సత్తువగా మారింది. పార్టీ తన ఉనికిని చాటుకోకపోతే, బతికి బట్ట కట్టడం అసాధ్యం. అందుకే ఈ ఎన్నికలను చావోరేవో భావిస్తున్న టీడీపీ, కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్దమంది. మొదట్లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును, మొదట ప్రచారానికి ఆహ్వానించారు తెలంగాణ తమ్ముళ్లు. అయితే ఇప్పటికే తనను తెలంగాణ ద్రోహిగా టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న తరుణంలో, ప్రచారానికి నిరాకరించారు బాబు. జూనియర్ ఎన్టీఆర్, నారా బ్రహ్మణీలకు తెలంగాణ పార్టీ వ్యవహారాలు అప్పజెప్పాలని కోరినా, ససేమిరా అన్నారు బాబు.
దీంతో హీరో బాలకృష్ణను తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దింపుతున్నారు టీడీపీ నేతలు. బాలకృష్ణకు తెలంగాణలో మంచి ఫాలో యింగ్ ఉంది. ఆయన తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తే, ఎన్టీఆర్ అభిమానులతో పాటు పార్టీకి అండగా నిలుస్తున్న ఓ సామాజిక వర్గం ఓట్లు, గంపగుత్తగా టీడీపీకి పడతాయని నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సెటిలర్లు అధికంగా ఉండే, ఖమ్మం, నల్గొండ, గ్రేటర్‌లో బాలయ్యను ప్రచార రంగంలోకి దించితే, మంచి ఫలితాలుంటాయని భావిస్తున్నారు. బాలకృష్ణ సభలకు భారీగా జనాలు వస్తున్నారని ఖమ్మం పర్యటనతో తేటతెల్లమైంది.
ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌లో ఉన్న బాలయ్య, అచ్చం ఎన్టీఆర్‌లా కనిపిస్తున్నారని, అదే గెటప్‌లో కొన్ని సభల్లో కూడా పాల్గొనాలని కోరుతున్నారు తెలుగు తమ్ముళ్లు. మొత్తానికి బాలయ్య రాకతో, తెలంగాణలో ప్రచారం మరింత కిక్కు వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఖుషీఖుషీ అవుతున్నారు. ఖమ్మంతో క్యాంపెయిన్ మొదలైనా, త్వరలో మరిన్ని ప్రాంతాల్లోనూ, బాలయ్యతో ప్రచారం నిర్వహించేందుకు డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు.