సభాపతులకే ఈ శాపం... ఎన్నికల్లో పరాజయం

Update: 2018-12-12 11:00 GMT

శాసనం ద్వారా ఎన్నికైన శాసనసభాపతులకు ఇదో శాపమేమో. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో సభాపతులు సత్తా చాటిన దాఖలాలు లేవు. ఒకసారి స్పీకర్‌ స్థానంలో కూర్చున్న ఏ నాయకుడు కూడా తిరిగి ప్రజాశీర్వాదంతో నెగ్గడం ఎప్పుడో కానీ జరగలేదు. రెండు దశాబ్దాల రాజకీయ చరిత్రను చూసుకుంటే ఇదే కనిపిస్తోంది. తాజాగా భూపాలపల్లి నుంచి ఓడిన మధుసూదనాచారితో ఈ ఆసక్తికరమైన చర్చ రాజకీయ పక్షాల్లో నడుస్తోంది. ఎందుకిలా? ఆ ఒక్కడు తప్ప అందరు స్పీకర్లకే ఎందుకీ శాపం? ఇంతకీ ఆ ఒక్కరు ఎవరు? 

నిజమే అనిపిస్తుంది. ఏ రాజకీయ నాయకుడైనా ఒక్కసారి సభాపతి స్థానంలో కూర్చుంటే... వచ్చే ఎన్నికల్లో తిరిగి ప్రజామోదం పొందిన దాఖలాలు లేవు. ఆ చరిత్ర కూడా లేదు. 1991 నుంచి 2018 వరకు అంటే దాదాపు రెండు దశాబ్దాల అవిభాజ్య తెలుగు రాజకీయ చరిత్రలో ఎవరికీ మళ్లీ ప్రజాప్రతినిధి అన్న గౌరవం దక్కలేదు. ప్రజలూ ఆమోదించలేదు.1991 నుంచి తీసుకుందాం. ఆ ఏడాది స్పీకర్‌ అయిన దుద్దిళ్ల శ్రీపాదరావు.. నాటి ఉమ్మడి రాష్ట్రంలో సభాపతిగా అందరి మన్ననలను పొందారు. సభను ఏకతాటిపై నడిపించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి స్పీకర్‌ అయినా... అందరి వాడిగా అభినందనలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన మావోయిస్టుల దాడిలో చనిపోయారు. 

1994లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌ అయిన యనమల రామకృష్ణుడు... అందరి అభిమానాన్ని చూరగొన్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే 1999లో ఈయన ఒక్కరే తిరిగి ఎన్నికయ్యారు. మంత్రి అయ్యారు. సభాపతి స్థానంలో కూచొని గెలిచి నిలిచిన నాయకుడు యనమలే. 1999లో యనమల స్థానంలో కూచున్న టీడీపీ ఎమ్మెల్యే ప్రతిభాభారతి.... ఫైర్‌ బ్రాండ్‌ స్పీకర్‌గా పేరొందారు. నాటి ప్రతిపక్ష నేతతో పాటు... ఏ ఒక్క విపక్ష నేతను మాట్లాడనీయకపోవడంతో సభలో ప్రతిభాభారతి ఫైర్‌బ్రాండ్‌ అయ్యారు. కానీ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో ప్రతిభాభారతి ఓడిపోయారు. ప్రజల ఆమోదాన్ని పొందలేకపోయారు.

ఇక కేఆర్‌ సురేష్‌రెడ్డి. 2004 నుంచి 2009 వరకు ఉన్న కాంగ్రెస్‌ హయాంలో ఈయన సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో సురేష్‌రెడ్డి ఓడిపోయారు. 2009లో ఇదే కాంగ్రెస్‌ నుంచి గెలిచిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి... 2011వరకు స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత అనూహ్యంగా ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో 2011లో నల్లారి సీఎం కావడంతో... స్పీకర్‌ స్థానాన్ని నాదెండ్ల మనోహర్‌ భర్తీచేశారు. ఈయన 2014 వరకు సభాపతిగా ఉండి... అప్పటి ఎన్నికల్లో ఓడిపోయారు. 

ఇప్పుడు తెలంగాణ స్పీకర్‌ మధుసూదనాచారి. 2014లో తెలంగాణ తొలి స్పీకర్‌గా బాధ్యతలు భుజానికెత్తుకున్న మధుసూదనాచారి... అన్ని పార్టీలకు అందరి వాడయ్యారు. భూపాలపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈయన... ఈసారి ఎన్నికల్లో మాత్రం ప్రజామోదం పొందలేకపోయారు. తన ప్రత్యర్థి, సమీప ప్రత్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇలా ఏ లెక్క చూసుకున్న... ఎలా లెక్కలు వేసినా... స్పీకర్‌ గెలవడం అరుదుగానే జరిగింది. ఒకరకంగా అది అసాధ్యమైంది.

Similar News