సెంటిమెంటే అస్త్రంగా కాంగ్రెస్ ప్రచార దూకుడు... మేడ్చల్ సభలో సోనియా ప్రసంగం ఆటకట్టుకోబోతుందా?
తెలంగాణ తెచ్చింది తామేనని టీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తోంది. అయితే ఇచ్చింది తామేనన్న ఆయుధానికి పదునుపెడుతోంది కాంగ్రెస్. తెలంగాణ సాకారమైన తర్వాత, తొలిసారి రాష్ట్రంలో అడుగుపెడుతున్న సోనియాతో అదే భావోద్వేగాస్త్రాన్ని, కేసీఆర్‌పై ఎక్కుపెట్టాలని ఆలోచిస్తోంది. మరి తెచ్చిన తెలంగాణ, టీఆర్ఎస్‌తోనే సురక్షితమన్న కేసీఆర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? ఇచ్చిన తెలంగాణను కాపాడుకోలేమా అంటున్న కాంగ్రెస్ అస్త్రం పని చేస్తుందా? మేడ్చల్ సభతో సోనియా ఏం చెప్పదల్చుకున్నారు?
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. స్వయంగా కేసీఆర్ కూడా సోనియా గాంధీకి,అసెంబ్లీలో కృతజ్ణతలు తెలిపారు. రాజకీయ ప్రయోజనాలైనా, ఇవ్వాల్సిన గత్యంతరమైనా, రకరకాల కారణాల నేపథ్యంలతో, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ భూస్థాపితమని అర్థమైనా తెలంగాణవైపు మొగ్గు చూపింది. కానీ 2014 ఎన్నికల్లో కేసీఆర్ చాణక్యం ముందు బొక్కబోర్లాపడింది కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమైంది. తెచ్చిన పార్టీగా సంబరాలు చేసుకున్న టీఆర్ఎస్, తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదంతా చరిత్ర.ఇప్పుడు 2018 ఎన్నికలు. పోయినచోటే వెతుక్కోవాలన్న ఆలోచనతో, తెలంగాణ ఇచ్చినపార్టీ అన్న సెంటిమెంట్‌ను బలంగా ప్రయోగించాలనుకుంటోంది కాంగ్రెస్. మేడ్చల్‌లో సోనియా గాంధీ సభతో, ఆ అస్త్రానికి భావోద్వేగాన్ని జోడించి, కేసీఆర్‌పై ప్రయోగించాలనుకుంటోంది.
తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియా గాంధీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్నతగా సోనియాకు సన్మానం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విద్యార్థులు అమరులు అవుతుంటే, రాష్ట్రం రావణకాష్టం అవుతుంటే చూడలేక, తెలంగాణను ఇచ్చామని, కానీ ఏ ఆశయంతోనైనా తెలంగాణ ఇచ్చామో, ఆ ఆశయాలను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమమయ్యారని, సోనియా ప్రసంగం ద్వారా ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇచ్చిన తెలంగాణను కాపాడుకోవడం, అమరుల ఆశయాలు నెరవేర్చడం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్న మాట చెప్పించాలనుకుంటున్నారు.
అలాగే తెలంగాణ ప్రకటన జారీ చేసిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్నీ, ఇప్పటికే రంగంలోకి దించింది కాంగ్రెస్. డిసెంబర్ తొమ్మిది నాటి ప్రకటన తానూ ఏనాడూ మర్చిపోనని అన్నారు చిదంబరం. తెలంగాణ రాష్ట్రానికి, తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు. అప్పుల్లేని రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, ఇప్పుడు అప్పులకుప్పగా మారిందన్నారు.
అటు తెలంగాణ డ్రాఫ్ట్‌ను రూపొందించిన జైరాంరమేశ్ కూడా, రణక్షేత్రంలోకి దిగారు. వీరిద్దరితో ప్రచారం చేయించి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ప్రజలకు గుర్తు చేయాలన్న వ్యూహంతో ముందుకెళుతున్నారు ఆ పార్టీ నేతలు.
అటు కాంగ్రెస్, తెలంగాణ సెంటిమెంట్‌కు పదునుపెడుతున్న తరుణంలో, దానికి దీటుగా అదే సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓడిపోతే, పార్టీకి నష్టం కాదని, అది ప్రజలకే నష్టమని, బహిరంగ సభల్లో వ్యాఖ్యానిస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో చంద్రబాబు, మహాకూటమి నాయకులు పాగావేస్తే, అది మొదటికే మోసమని, అంటున్నారు.
మొత్తానికి మేడ్చల్ సభతో, తెలంగాణ ఇచ్చామన్న సెంటిమెంట్ రగిలించాలని కాంగ్రెస్ స్ట్రాటజిక్‌గా ముందుకెళుతోంది. సోనియా గాంధీతోనే ఆ మాట చెప్పించాలని అనుకుంటోంది. అటు కేసీఆర్ కూడా, అదే సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్నారు. మరి ఇద్దరి సెంటిమెంట్లలో, ఎవరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ఇద్దరి మాటలను జనం ఎలా అర్థం చేసుకుంటారు? లెటజ్ వెయిట్ ఫర్ డిసెంబర్ లెవన్.