నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కు బాడీగార్డులు హత్య చేయడంతో.. ఒక్క సారిగా దేశమంతా సిక్కు వ్యతిరేకత అల్లర్లు చెలరేగాయి. ప్రధానంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా జరిగాయి. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే అధికంగా ఢిల్లీలోనే మారణహోమం అధికంగా జరిగింది. అల్లరి మూకలు అత్యంత దారుణంగా 3 వేల మంది సిక్కులను ఊచకోత కోశాయి. సిక్కుల వేషధారణతో కనిపించిన ప్రతి ఒక్కర్నీ పాశవికంగా చంపేశారు. సిక్కులు అధికంగా నివసించే, ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో, ప్రవేశించి, దారుణంగా హత్య చేశారు. వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అయినవారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోదించాయి. న్యాయం కోసం 34 ఏళ్లుగా పోరాడుతున్నాయి.
ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని రాజ్‌నగర్‌లో, ఐదుగురు సిక్కులు కేహార్ సింగ్, గుర్‌ప్రీత్ సింగ్, రఘువేందర్ సింగ్, నరేందర్ పాల్ సింగ్, కుల్దీప్ సింగ్‌లను కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌తో పాటు మరో ఐదుగురు కలిసి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మారణహోమానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జన్ కుమార్ కారకుడని సీబీఐ న్యాయస్థానం తీర్పిచ్చింది. నాటి నుంచి నేటి వరకు, సజ్జన్ కుమార్‌పై కేసుల టైమ్‌లైన్ ఒక్కసారి చూస్తే....
ప్రత్యేక ఖలిస్థాన్ డిమాండ్ చేస్తూ, జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే నేతృత్వంలోని, సిక్కు మిలిటెంట్లు, స్వర్ణదేవాలయంలో ప్రవేశించారు. అయితే ఉగ్రవాదులను ఏమాత్రం ఉపేక్షించేదిలేదన్న నాటి ప్రధాని ఇందిరా గాంధీ, స్వర్ణదేవాలయంలో దాక్కున్న సిక్కు వేర్పాటు వాదులను ఏరిపారేయడానికి ఆదేశాలిచ్చారు. అదే ఆపరేషన్ బ్లూస్టార్. ఇందిర అత్యంత డేరింగ్ డాషింగ్‌గా నిర్ణయం తీసుకున్న ఆపరేషన్ బ్లూస్టార్‌లో, అనేక మంది సిక్కు మిలిటెంట్లు, సాధారణ ప్రజలు, సైనికులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. తుపాకీ గుళ్లకు స్వర్ణదేవాలయం బాగా దెబ్బతింది. అయితే, సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయంలోకి, సైనికులు బూట్లు వేసుకుని వెళ్లారని, సిక్కులు ఆగ్రహించారు. దేవాలయాన్ని ధ్వంసం చేశారని, అపవిత్రం చేశారని, రగిలిపోయారు. అదే ఇందిరా గాంధీకి మరణశాసనమైంది.
ఐరిష్ టెలివిజన్ ఇంటర్వ్యూ కోసం రెడీ అయ్యి, ఇంట్లోంచి బయటకు వస్తున్నారు ఇందిరా గాంధీ. ఉద్యానవనం గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే, తనను రక్షించడానికే ఉన్న బాడీగార్డులే, తనను హత్య చేస్తారని ఆమె ఊహించుకోలేకపోయారు. ఆపరేషన్ బ్లూస్టార్‌పై రగిలిపోతున్న సిక్కు అంగరక్షకులు, ఆమెపై కాల్పుల వర్షం కురిపించారు. కాల్పులు జరిపింది సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్. సబ్‌ఇనస్పెక్టరు అయిన బియాంత్ సింగ్, మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. వెంటనే సత్వంత్ సింగ్ తన వద్ద ఉన్న స్టెన్ గన్ తో 30 రౌండ్లు కాల్చాడు. ఆమె నేలకూలే వరకు గన్ పేలుస్తూనే ఉన్నాడు. అక్కడికక్కడే ఇందిర ఒరిగిపోయింది. ఇందిర హత్య దేశాన్ని భగ్గుమనేలా చేసింది. ఎక్కడికక్కడ సిక్కులను ఊచకోత కోశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాలో, రాజీవ్ గాంధీ ప్రోద్బలంతో, సిక్కులను చంపేశారని ఆరోపణలొచ్చాయి. ఇందిరకు అత్యంత సన్నిహితులైన కమల్‌నాథ్, జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్‌తో పాటు అనేకమంది కాంగ్రెస్ నాయకులు, అల్లరి మూకలను సిక్కులపై రెచ్చగొట్టారన్న ఆరోపణలున్నాయి. సిక్కుల హత్యలపై 34 ఏళ్లపాటు బాధితులు పోరాటం చేశారు. కాంగ్రెస్ హయాంలోని చాలామంది కాంగ్రెస్ నేతలకు క్లీన్ వచ్చింది. మోడీ అధికారంలోకి వచ్చాక, ఈ కేసు విచారణ మరింత వేగవంతమైంది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు మోడీ.
గత నెలలో విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 88 మంది దోషులకు సెషన్స్ కోర్టు విధించిన జైలు శిక్షలను హైకోర్టు సమర్థించింది. సిక్కులపై ఊచకోత కేసులో 1984 నవంబరు 2న, 107 మంది అరెస్టయ్యారు. వీరిలో 88 మంది దోషులని సెషన్స్ కోర్టు 1996 ఆగస్టు 27న తీర్పు ఇచ్చింది. దీంతో దోషులు ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వీరి వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. తాజాగా సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్ధారిస్తూ, యావజ్జీవ శిక్ష విధించింది ఢిల్లీ హైకోర్టు. కోర్టు తీర్పును బాధితులు స్వాగతించారు. బీజేపీ, ఆప్, అకాలీదళ్ నేతలు, సజ్జన్, టైట్లర్, కమల్‌నాథ్‌లను పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎవరినీ వెనకేసుకురాదని, అయితే 2002 గుజరాత్ అల్లర్ల సంగతేంటని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.
మొత్తానికి 1984 నుంచి ఇప్పటి వరకూ సిక్కుల ఊచకోత కేసు, అనేక మలుపులు తిరిగింది. ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే, వారి అనుకూలంగా మలచుకునే ప్రయత్నం జరుగింది. దర్యాప్తు సంస్థల నివేదికలు కూడా, ప్రభుత్వాన్ని బట్టి మారిపోయాయని బాధితులు ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో సజ్జనార్, టైట్లర్, కమల్‌నాథ్‌లకు క్లీన్ లభించింది. ఇప్పుడే అదే సజ్జనార్‌కు యావజ్జీవం పడింది. అయితే, తమకు న్యాయం జరగాలని బాధితులు కోరుతున్నారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, వారిని శిక్షించాలని, 34 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా నిస్పక్షపాతంగా విచారణ జరిపి, దోషులను బోనెక్కించాలని కోరుతున్నారు.