మాడు పగలకొడుతున్న ఎండల నుంచి త్వరలోనే అందరికీ ఉపశమనం కలగనుంది. నైరుతి రుతుపవనాలు ఒకరోజు ముందే కేరళలోకి ప్రవేశించాయి. అప్పుడే.. అక్కడ వర్షాలు కూడా మొదలయ్యాయి. మరో వారం రోజుల్లో.. రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటరవుతాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాలు రాకపై.. రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నైరుతి రుతపవనాలు కేరళలోకి వచ్చేశాయ్. మరో వారంలో.. తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయ్. ఇక.. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. ప్రతి ఏడాది జూన్ తొలివారంలో వచ్చే రుతుపవనాలు ఈసారి ఒకరోజు ముందుగానే వచ్చాయి. ఏడేళ్ల తర్వాత.. మే29న నైరుతి పవనాలు వచ్చాయి. ఆ సంవత్సరంలో వర్షాలు సాధారణ స్థాయిలోనే కురిశాయని.. రైతులు సంతోషంగా పంటలు వేసుకోవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
మే నెల చివరలో రుతుపవనాలు ప్రవేశించడం వల్ల.. జులైలో పడాల్సిన వర్షాలు.. జూన్‌లోనే కురుస్తాయ్. సాధారణంగా రైతులు వ్యవసాయ పనులు జులైలో మొదలుపెడతారు. ఇలా రుతుపవనాలు ముందుగా వచ్చి.. వర్షాలు కూడా ముందుగానే కరవడం వల్ల.. జులై లోనే వర్షాలు తేలిపోతాయ్. అందువల్ల.. ఇది రైతులకు కాస్త ఇబ్బంది కలిగించే అంశమేనంటున్నారు రైతుసంఘం నేతలు.
రైతులు ఆందోళనపడుతున్నట్లు.. ఏడేళ్ల క్రితం నాటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. 2011_2012 సాగుబడి విస్తీర్ణం, దిగుబడులు అంతకు ముందు సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి. 2010_11లో వరిసాగు 47.51 లక్షల హెక్టార్లుగా ఉండి 144 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అదే 2011_2012లో వరి 40.95 లక్షల హెక్టార్లు సాగు చేస్తే కేవలం 129 లక్షల టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. ఇక.. మిగిలిన ధాన్యాలు, పప్పుదినుసులు 2010_2011 లో 58.98 లక్షల హెక్టార్లలో సాగుచేస్తే.. 188 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. కానీ, 2011_2012లో మాత్రం 53.59 లక్షల హెక్టార్లలో సాగు చేస్తే 162 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. నూనెగింజల సాగులోనే ఇదే పరిస్థితి. ఈ గణాంకాలతో పోలిస్తే.. నైరుతి పవనాలు ముందుగా రావడం.. రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.