అడిలైడ్ లో టెస్టులో విజయం సాధించి ఊపుమీద ఉన్న భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. రెండో టెస్టు ఆరంభానికి ముందే ఇద్దరు టీమిండియా కీలక ఆటగాళ్లు గాయం కారణంగా ఆటకు దూరమయ్యారు. శుక్రవారం పెర్త్ వేదికగా ఆరంభంకానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు అశ్విన్, రోహిత్ శర్మలు దూరమయ్యారు. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా వీరిద్దరూ గాయపడ్డారు. దాంతో ఫిట్ నెస్ కోల్పోవడంతో రెండో టెస్టులో స్థానం కోల్పోయారు. మరోవైపు గాయంతో తొలి టెస్టుకు దూరమైన ఓపెనర్ పృథ్వీషా ఇంకా కోలుకోలేదు. దీంతో వీరి స్థానాల్లో హునుమ విహారీ, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశారు. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గాయం కారణంగా దూరమవడంతో టీమిండియాకు ఎదురుదెబ్బే అని చెప్పాలి. మరోవైపు పెర్త్ పిచ్ టీమిండియా కంటే ఆసీస్ ఆటగాళ్లకే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లకు అనువుగా ఉంటుందని గతంలో చాలా సార్లు రుజువైంది.