తెలంగాణలో రాహుల్్ గాంధీ ప్రజాగర్జన...కాంగ్రెస్‌లో సమరోత్సాహం నింపిందా...యువ నాయకుడి కర్తవ్యబోధ...కార్యకర్తలను యుద్ధానికి సిద్దం చేసిందా....గులాబీదళంపై సకల విమర్శనాస్త్రాలు సంధించిన రాహుల్...ఆ దిశగా గాంధీభవన్‌కు దిశానిర్దేశం చేశారా....రాహుల్ సుడిగాలి పర్యటన....చురకత్తుల్లాంటి మాటలు...పదునైన వాగ్భాణాలు...యమ జోష్‌గా సాగిన టూర్...కాంగ్రెస్‌లో నిజంగానే జోష్ నింపిందా? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రాక కోసం, చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు, తెలంగాణలో పర్యటించిన రాహుల్, నిస్తేజంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌లో యమ జోష్ నింపేసి వెళ్లారు. రాహుల్ టూర్‌తోనే కేసీఆర్‌కు కాక రేగిందని భావించిన సీనియర్లు, ఎన్నికల తేదీలు వెల్లడైన తర్వాత యువ నాయకుడితో భారీ బహిరంగ సభలు పెట్టి, సమరోత్సాహంతో వెళ్లాలని భావించారు. అనుకున్నట్టుగానే మూడు చోట్ల సమరనాదం చేసి, కదంతొక్కించారు. ప్రజాగర్జన పేరుతో శంఖారావం పూరించారు రాహుల్ గాంధీ. తొలుత భైన్సా సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఆద్యంతం కార్యకర్తలు, జనాల్లో హుషారునింపే ప్రయత్నం చేశారు. అమరుల త్యాగాలను చూసి, వారి శోకంతో చలించిపోయి, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, కానీ వారి ఆశయాలకు కేసీఆర్ తూట్లు పొడిచారని విమర్శించారు. కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకున్న కేసీఆర్, ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిన నిరుద్యోగులకు మాత్రం ఉపాధి చూపించలేదన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఇక ఆ తర్వాత కామారెడ్డి సభలోనూ చెలరేగిపోయారు కాంగ్రెస్ అధ్యక్షుడు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్, నియంతల్లా పాలిస్తున్నారని వాగ్బాణాలు సంధించారు. ఇద్దరూ ఏకమయ్యారని, కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రత్యర్థులపై ప్రభుత్వ విభాగాలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. వారికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు రాహుల్. కాంగ్రెస్ ఇస్తానన్న హామీలకు భయపడి, మినీఫెస్టోలో వాటన్నింటినీ కాపీ కొట్టారని విమర్శించారు. ఒకవైపు రిజర్వేషన్లు పేరుతో ముస్లింలను కేసీఆర్ మోసం చేస్తున్నారని, మరోవైపు దేశవ్యాప్తంగా ముస్లింలపై దాడులు పెరుగుతున్నా మోడీ మౌనంగా ఉన్నారని గుర్తు చేశారు రాహుల్. ఇక కామారెడ్డి తర్వాత, చార్మినార్ సద్భావన యాత్రలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాహుల్ గాంధీ టూర్‌ను ఉపయోగించుకుంది తెలంగాణ కాంగ్రెస్. అందుకు నిదర్శనం, రాహుల్ పాల్గొన్న మూడు కార్యక్రమాలు కూడా, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే. ఎంఐఎం, టీఆర్ఎస్‌లకు మళ్లిపోయిన ముస్లిం ఓటు బ్యాంకును తిరిగి తమవైపు తిప్పికునేందుకే, రాహుల్ సభలను, ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసి, సక్సెస్ చేశామనుకుంటోంది కాంగ్రెస్. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రచార భేరి మోగించారు రాహుల్ గాంధీ. బహిరంగ సభలకు భారీగా జనం హాజరుకావడం, రాహుల్ గాంధీ ధాటిగా ప్రసంగించడం, తనను పెద్ద జోకర్ అంటూ విమర్శించిన కేసీఆర్‌పై మాటల తూటాలు పేల్చడంతో, కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. మహాకూటమి ఏర్పాటుతో, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ పోగవుతున్నాయని, ప్రజల్లోకి మరింతగా చొచ్చుకుపోవాలన్న రాహుల్ నిర్దేశంతో, ఇక రాబోయే రోజుల్లో కదనకుతూహలంతో కదంతొక్కాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, మ్యానిఫెస్టోలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాహుల్ మార్గోపదేశం చేయడంతో, ఇక ఊరూరా ప్రచారహోరు పెంచాలని కార్యాచరణ రూపొందిస్తున్నారు నాయకులు. రానున్న రోజుల్లో రాహుల్‌తో మరిన్ని సమావేశాలు నిర్వహించాలని, అలాగే సోనియా గాంధీతోనూ సభలు పెట్టించాలని ప్రణాళికలు వేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.