ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక...మూడో కూటమితో మారనున్న రాజకీయం

Update: 2018-08-06 05:55 GMT

చెక్కతో చేసిన కీలు గుర్రం గాల్లో ఎగురుతుందా ? 1949లో విడుదలైన కీలుగుర్రం సినిమాలో మాత్రం ఆ గుర్రం గాల్లో ఎగిరింది.  ఇప్పుడు దేశంలో విపక్షాల నాయకులు ఎంతో మంది కీలుగుర్రాలపై విహరిస్తున్నారు. కాకపోతే అవి నేలపైనే ముందుకూ, వెనక్కూ ఊగుతున్నాయి. అయినా కూడా విపక్ష నాయకుల కలల విహారాలు మాత్రం ఆగడం లేదు.  విపక్ష నాయకులు ఎంతో మంది ఇప్పుడు ప్రధానమంత్రి పీఠంపై కన్నేశారు. అలాంటి వారంతా ఒకవైపున కాంగ్రెస్ పై రకరకాల ఒత్తిళ్ళు తెస్తూ, మరో వైపున ఎవరికి వారు మూడో ఫ్రంట్ దుకాణం ఏర్పాటుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి విపక్షాల వ్యూహాలు ఫలిస్తాయా ? కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి ? ప్రియాంక గాంధీ ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తారా ? ఆమె వస్తే విపక్షాల ధోరణిలో మార్పు వస్తుందా ? 

కీలు గుర్రం గురించి ముచ్చటించుకున్నాం కదా ఇలాంటి కథనే గ్రీకు పురాణాల్లో ఒకటి ఉంది. అది కూడా మన దేశ రాజకీయాలకు అద్దం పట్టేలా ఉంది. అదే ట్రోజన్ వార్. ట్రాయ్ నగరాన్ని  గ్రీకులు ముట్టడిస్తారు. పదేళ్ళు ముట్టడించినా ఫలితం ఉండదు. దీంతో గ్రీకులు ఒక పెద్ద చెక్క గుర్రాన్ని యుద్ధ భూమిలో వదిలేసి కాస్తంత వెనక్కు తగ్గుతారు.   ట్రాయ్ నగరవాసులు తామే గెలిచామనుకుంటారు. విజయానికి గుర్తుగా ఆ పెద్ద చెక్క గుర్రాన్ని నగరంలోకి తీసుకువస్తారు. రాత్రి వేళ ఆ చెక్క గుర్రంలో దాక్కున్న గ్రీకు వీరులు బయటకు వచ్చి నగర ద్వారాలు తెరుస్తారు. దాంతో గ్రీకు సైన్యం ట్రాయ్ నగరంపై విజయం సాధిస్తుంది. ఇక్కడ కీలక పాత్ర వహించింది ట్రోజన్ హార్స్. ఇప్పుడు దేశంలో మూడో ఫ్రంట్ కూడా ముచ్చట కూడా ఇలానే ఉండనుందా ? అది బీజేపీ వ్యతిరేక ఓట్లనే చీలుస్తుందా ?బీజేపీకి అనుకూలంగా ట్రోజన్ హార్స్ పాత్రను ఎవరు పోషించనున్నారు ?అసలు విపక్షం ఒక్కటవుతుందా ? ప్రధాని అభ్యర్థి ఎవరు ? కాంగ్రెస్ ఎన్ని త్యాగాలు చేయాలి ?  లాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తెరమీదకు వచ్చాయి. 

లోక్ సభ ఎన్నికలనగానే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం సహజం. ఈ దఫా మాత్రందేశ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్  ఆ విషయంలో వెనక్కు వెళ్ళింది. అదే సమయంలో వ్యూహాత్మకంగా ప్రియాంక గాంధీని రంగంలోకి దించే అవకాశాలనూ పరిశీలిస్తోంది. రాయ్ బరేలీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తన తల్లి స్థానంలో రాయ్ బరేలీ నుంచి ప్రియాంక రంగంలోకి దిగే అవకాశం ఉంది. రేపటి నాడు కాంగ్రెస్ లో లేదా కాంగ్రెస్ మిత్ర పక్షాల్లో రాహుల్ గాంధీ పై సానుకూలత తగ్గితే, రాహుల్ కు అండగా ప్రియాంక నిలిచే అవకాశం ఉంది. పార్టీ చరిత్రలో తొలిసారిగా ప్రధాన మంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే కాంగ్రెస్ ఈ దఫా ఎన్నికల బరిలోకి దిగుతోంది. విపక్షాల్లో కాంగ్రెస్ కు తగ్గిన ప్రాధాన్యాన్ని, ఆ పార్టీపై పెరిగిపోయిన ఒత్తిళ్ళకు ఇది నిదర్శనంగా నిలిచింది. విపక్షాలకు నాయకత్వం వహించాల్సిన కాంగ్రెస్ వాటితో సమానంగా కలసి నడిచేందుకు అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇతర విపక్ష నాయకులను ప్రధాని పీఠంపై కన్నేసేలా చేసింది.

గతంలో జరిగిన వివిధ ఎన్నికల్లో రామాలయ వివాదంతో లబ్ధి పొందిన బీజేపీ ఈ దఫా జాతీయవాదాన్ని బలంగా ముందుకు తీసుకువస్తోంది. తాజాగా అసోం ఉదంతం విపక్షాల్లో చీలికకూ దారి తీసేలా కనిపిస్తోంది. అసోంలో విదేశీయులను బయటకు పంపేందుకు వీలుగా అక్కడ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ముసాయిదా ప్రకటించారు. దాదాపు 40 లక్షల మంది తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. వీరిలో అత్యధికులు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారే. గతంలో చేసిన వాగ్దానం మేరకు కాంగ్రెస్ ఈ ప్రక్రియను వ్యతిరేకించే పరిస్థితి లేదు. అదే సమయంలో మమతా బెనర్జీ మాత్రం ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మైనారిటీల ఓట్లపై కన్నేసిన మరి కొన్ని విపక్షాలు కూడా ఈ ప్రక్రియను వ్యతిరేకించే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే బీజేపీ జాతీయతావాదం విపక్షాలను ముక్కలు చేసింది. విపక్షం ముక్కచెక్కలు కావడం తిరిగి బీజేపీకే పట్టం కట్టేలా చేసే అవకాశం ఉంది. అందుకే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ట్రోజన్ హార్స్ అంటూ బెంగాల్  కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రధాని పీఠంపై కన్నేసినందువల్లే మమతా బెనర్జీ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐక్య ప్రతిపక్షాన్ని చీల్చేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 

నిజానికి ప్రధాని పీఠంపై కన్నేసింది మమతా బెనర్జీ ఒక్కరే కాదు. దక్షిణాది ఉత్తరాది నాయకులు కూడా ఈ పీఠం పై కన్నేశారు. ఎవరికి వారు తామే మూడో ఫ్రంట్ కు నేతృత్వం వహించేందుకు సిద్ధపడుతున్నారు. రకరకాల సూత్రీకరణలతో ఇతర పార్టీలను తమతో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యునైటెడ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ను చేర్చుకోవడంపై కొన్ని పక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ను చేర్చుకోకుంటే తామూ దూరమవుతామని మరికొన్ని పార్టీలు అంటున్నాయి. ఇక వామపక్షాలది మరో రగడ. ఒకటి కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా ఉంటే, మరొకటి అంత సానుకూలంగా లేదు. బీజేపీకి దూరమవుతూ విపక్షాలకు చేరువ కావాలని శివసేన ప్రయత్నిస్తోంది. శివసేనను దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గతంలో కాంగ్రెస్, వామపక్షాల మద్దతులో మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడడం ప్రస్తుత విపక్ష నాయకుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. పదుల సంఖ్యలో సీట్లు గెలుచుకుంటే ప్రధాని పీఠం దక్కించుకోవచ్చన్న ఆశ వారిలో తలెత్తుతోంది. 

ఒక వైపున బీజేపీ రామాలయ అస్ర్తాన్ని అమ్ముల పొదిలో భద్రపరుచుకుంటూనే, తాజాగా జాతీయతా వాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. త్వరలోనే కశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ విజయంతో బీజేపీ తన జాతీయత వ్యూహాన్ని మరింత పదునెక్కించే అవకాశం కూడా ఉంది. మరో వైపున దేశంలో ఇంతకు ముందెన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. ఈ దఫా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న ఏకైక ఎజెండాతోనే కాంగ్రెస్ తన వ్యూహాలను రూపొందించుకుంటోంది. అందుకే ఎన్నో త్యాగాలకూ సిద్ధపడుతోంది.

తొలిసారిగా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలనే అంశంపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చాయి. అదే సమయంలో మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో  కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతోంది.  ఉత్తరప్రదేశ్ లో బద్ద శత్రువులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ ఇప్పుడు పొత్తులకు సిద్ధమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే కీలకంగా ఉన్న పార్టీలతో తగ్గు ధోరణిలో వ్యవహరించేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతోంది. అంతమాత్రాన అన్ని రాష్ట్రాల్లోనూ అదే తరహా పరిస్థితి ఏర్పడే అవకాశం లేదు. 

శరద్ పవార్ లాంటి కొంతమంది నాయకులు 1977 నాటి పరిస్థితిని గుర్తుకు చేసుకుంటున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. తిరిగి అలాంటి చారిత్రక విజయం విపక్షాలకు సాధ్యమా అనేది అనుమానాస్పదమే. యాంటీ బీజేపీ అనే అంశం వివిధ విపక్షాలను ఒక్కటి చేసేందుకు  కొంతవరకు పని చేసినా క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు తప్పవు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆయా విపక్షాలతో  పోటీ పడాల్సి వస్తోంది. పశ్చిమ బెంగాల్ లో స్థానిక కాంగ్రెస్ నాయకత్వం తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, సీఎం మమతా బెనర్జీ ధోరణిని తీవ్రంగా విమర్శిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధమైన పోరాటాలు తప్పకపోవచ్చు. మరో వైపున సీట్ల సర్దుబాటు అంత సులభంగా తేలే అంశం కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు అధిక సంఖ్యలో లోక్ సభ సీట్లను ఆశిస్తున్నాయి. వాటిని కాదనే స్థితిలో కాంగ్రెస్ లేదు. 

బీజేపీ ఒకవైపున, కాంగ్రెస్ మరో వైపున రెండు ఫ్రంట్ లకు నేతృత్వం వహించనున్నాయి.  మరో వైపున వామపక్షాల ధోరణి కూడా కొంతవరకు కీలకం కానుంది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడిన 1989 నుంచి 1999 వరకు పదేళ్ళ పాటు వామ పక్షాలు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాయి. ఆ తరువాత మాత్ర వాటి ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. స్వీయ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న ఆ పార్టీలు స్వయంగా ఫ్రంట్ లకు నాయకత్వం వహించే పరిస్థితి లేదు. మరి మూడో ఫ్రంట్ ఎవరు ఏర్పరుస్తారు? అది ఎలా ఉండనుంది ? యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్ అంటూ కొన్ని విపక్షాలు మూడో ఫ్రంట్ గా ఏర్పడితే అది బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చదా ? లాంటి అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకైతే మూడో ఫ్రంట్ ఏర్పడలేదు ఒక వేళ ఏర్పడితే మాత్రం దేశ రాజకీయాలను అది ప్రభావితం చేయనుంది. ఏవి కీలుగుర్రాలుగా మిగులుతాయి ? ఏది ట్రోజన్ హార్స్ పాత్ర పోషిస్తుంది అనేది ఎన్నికల ఫలితాల తరువాతే తేలనుంది.   

Similar News