ప్రభుత్వాన్ని ఎండగడుతూ విపక్షాన్ని తూలనాడుతూ స్థానిక సమస్యలపై దృష్టి పెడుతూ మాంచి జోరుగా పవన్ ఉత్తరాంధ్ర టూర్ ముగిసింది. జనసేన లోకి ఇప్పుడిప్పుడే చేరికలూ మొదలయ్యాయి..పవన్ ఉత్తరాంధ్ర టూర్ ఏం చెబుతోంది? పవర్ స్టార్ బలమెంత పెరిగింది?
ఉత్తరాంధ్రను తన ఆవేశ పూరిత ప్రసంగంతో ఒక కుదుపు కుదిపాడు. అభివృద్ధికి ఆమడ దూరంలో వెనుకబాటుతనంతో ఉన్నా సమైక్యతనే కోరుకున్న ఉత్తరాంధ్ర ప్రజల్లో తన ప్రసంగాలతో చైతన్యం నింపాడు పవన్ వెనుకబాటు తనాన్ని తొలగించడానికి పాలకులు శ్రద్ధ చూపకపోతే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోరినా ఆశ్చర్యం లేదంటూ పదేపదే చెప్పుకొచ్చాడు పవన్ జనసేన అధినేత ఉత్తరాంధ్ర టూర్ విజయవంతంగా ముగిసింది. ఇప్పటి వరకూ టీడీపీ, వైసీపీ మధ్య ఊగిసలాడిన జన సందోహం తొలిసారిగా మూడో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించేలా చేయగలిగాడు పవన్. పవన్ యాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది.
జనాన్ని ఉర్రూతలూగించాడు ఆలోచింప చేశాడు. ఓట్ల కోసమే యాత్రలు చేసే వారికి భిన్నంగా పవన్ యాత్ర సాగింది. అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు పవన్ యాత్ర సందర్భంగా విశాఖలో వలసలజోరూ కనిపించింది. ఇదంతా బలమే అనుకోవాలా అంటే మాత్రం విశ్లేషకులు కాదంటున్నారు బిసీ వర్గాలు ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్రలో పవన్ కొంత మేర ప్రభావం చూపగలిగినా టీడీపీకి కంచుకోటలా ఉన్న ఈ జిల్లాలో పవన్ మూడో ప్రత్యామ్నాయం కావడానికి ఇంకా టైం పడుతుందంటున్నారు విశ్లేషకులు. వైసీపీ, టీడీపీ హోరా హోరీగా తలపడే ఇక్కడ వైసీపీ గతఎన్నికల్లో గెలుపుకి కొంత దూరంలో ఆగిపోయింది. ఈసారీ సీన్ అలాగే ఉండేలా కనిపిస్తోంది. కాకపోతే టీడీపీ, వైసీపీలను కాదనుకున్న వారు మాత్రం పవన్ పార్టీ వైపు చూస్తున్నారు.
బలమైన జనాకర్షణ ఉన్న నేతలెవరూ జనసేన వైపు వెళ్లడంలేదు. కుల సమీకరణల్లో కొంత ఓటుబ్యాంకు పవన్ వైపు వెళ్లినా అది ప్రభావితం చేసేంత కాదన్నది ఒక వాదన. కానీ పవన్ ఉత్తరాంధ్రలో స్థానిక సమస్యలపై దృష్టి పెట్టడం చూస్తుంటే కొన్ని సీట్లయినా అక్కడ చేజిక్కించుకోవాలన్న పట్టుదల ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో పవన్ గట్టి పట్టుదలతో ఉన్నాడు అక్కడ దృష్టి పెడితే ఒకటి రెండు సీట్లయినా సాధించవచ్చన్న ఆలోచనలో జనసేన ఉన్నట్లు కనిపిస్తోంది.
ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత పవన్ సొంతగడ్డపై కాలు పెడుతున్నారు పవన్ గోదావరి జిల్లాల్లో అడుగు పెడితే రాజకీయ వేడి పెరగడం ఖాయమంటున్నారు విశ్లేషకులు ఉత్తరాంధ్రలో అధికార పార్టీని ఉతికి ఆరేసిన పవన్ గోదావరి జిల్లాల్లోనైనా వ్యూహం మార్చి సొంత పార్టీ బలోపేతంపై దృష్టి పెడతాడా అన్నది చూడాలి.