కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీ ....మోడీ చరిష్మాపై నమ్మకమున్న పార్టీ. అమిత్ షా చాణక్యం అచంచల విశ్వాసమున్న పార్టీ. రెండు సార్లు ఆ జిల్లాలో పర్యటనలు చేసింది. సమీకరణాలు పక్కాగా చూసుకుంది. అయినా, భారతీయ జనతా పార్టీకి, అక్కడ అభ్యర్థులు దొరకడం లేదు. కాగడా పెట్టి వెతికినా, గెలుపు గుర్రం తారసపడ్డంలేదు. ఇంతకీ ఏదా జిల్లా...ఎందుకా పరిస్థితి... అయినప్పటికీ పార్టీ లో పెద్దగా జాయినింగ్స్ లేవు...పెద్దగా పేరుమోసిన నేతల జాయినింగ్స్ లేవు...దీనికి తోడు ముందస్తు ఎన్నికలు....ఇప్పటికే రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది బిజెపి... కానీ రెండు నియోజకవర్గాలలో మాత్రం ఫోటీ చేయడానికే బిజెపి జిల్లా పార్టీ అద్యక్షులే వెనుకంజ వేస్తున్నారు...ఇక ప్రకటించిన స్థానాలలో బిసిలకు న్యాయం చేయలేదని ..ప్రకటించే మరొ జాబితాలో అవకాశం ఇవ్వాలని బిసిల డిమాండ్ ..ఇలా అంతర్గత పోరుతో ముందుకు పోతుంది నల్లగొండ బిజెపి శాఖ....
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో మొదటి జాబితాలో సూర్యాపేట నుంచి సంకినేని వెంకటేశ్వర రావు, మునుగోడు నుంచి గంగిడి మనోహర్ రెడ్డిలను ప్రకటించారు. ఇక రెండో విడతలోను నాగార్జున సాగర్ నుంచి బిజెపి నేత కంకణాల శ్రీధర్ రెడ్డి సతీమణి నివేదితను....ఆలేరు నుంచి దొంతిరి శ్రీధర్ రెడ్డిలను ఎంపిక చేసారు. దీంతో ప్రకటించిన నాలుగు సీట్లను ఓసీలకే ఇచ్చారని, పార్టీలో తొలి నుంచి పనిచేస్తున్న బిసిలకు న్యాయం జరగలేదన్న విమర్శ వినిపిస్తోంది. పన్నెండులో రెండు ఎస్సీలు, ఒకటి ఎస్టీ. అంటే మూడు రిజర్వుడు స్థానాలు. ఇప్పటికే ప్రకటించిన నాలుగుతో పాటు, మూడింటిలోను బిసిలకు అవకాశం లేదని మిగతా ఐదు స్థానాలలో అవకాశం ఇవ్వాలని బిజెపిలోని బిసి నేతలు ఇప్పటికే రాష్ట్ర శాఖను కోరారు. ఈ డిమాండ్ల నేపథ్యంలో, మూడో జాబితా ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి.
ఇక నల్లగొండ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కోసం అన్వేషణ సాగుతోంది. ప్రస్తుతం బిజెపి జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహా రెడ్డి పోటీకి విముఖతతో ఉన్నారు. పలువురు సీనియర్ నేతలు సైతం పోటీపై ఆసక్తి చూపడం లేదు. దీంతో అభ్యర్థి కోసం సెర్చింగ్ సాగుతోంది. కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్‌లో చేరి, 2014లో టికెట్ పొందలేకపోయిన ఓ సీనియర్ టిఆర్ఎస్ నేత సైతం బిజెపిలో చేరి, పోటీ చేయాలన్న భావనలో ఉన్నట్లు సమాచారం. ఇక భువనగిరి లో అయితే అభ్యర్థి దొరకని పరిస్థితి. ప్రస్తుతం బిజెపి జిల్లా అధ్యక్షుడు పివి శ్యాంసుందర్ రావు సైతం బరిలోకి దిగేందుకు సిద్దంగా లేరు. దీంతో రెండో స్థాయి నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు స్థానాలు పోతే...మిర్యాలగూడ, కోదాడ, హుజూర్ నగర్‌లోను అభ్యర్ధుల కోసం వేట సాగుతోంది. ఇక్కడ కూడా పార్టీకి, గెలిపించుకునే స్థాయి గల నేతలు లేరు. దీంతో బలమైన అభ్యర్ధుల కోసం తీవ్ర స్థాయిలో వెతుకుతున్నారు నేతలు..
మొత్తంగా, బిజెపి పార్టీ స్థాపన నుంచి నల్గొండ జిల్లాలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే సీటును గెలుపొందలేదు. ఈసారి ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్న క్రమంలో, కచ్చితంగా జిల్లాలో పాగా వేయాలని చూస్తున్నా....క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇక మూడో విడత జాబితా రానున్న నేపథ్యంలో, బీసీ నేతలు ఆఖరి ఆశగా ఎదురుచూస్తున్నారు. మరేం అవుతుందో చూడాలి.