మైసూరు ప్యాలెస్ దసరా సంబరాలు..

Update: 2017-12-13 14:41 GMT

ప్రపంచంలో దసరా ఘనంగా ఎక్కడ జరుగుతుందని అంటే మొదట గుర్తుకొచ్చే పేరు మైసూరు. శతాబ్దాలుగా దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా అంబరాన్ని తాకే సంబరాలతో నిర్వహించడం మైసూరు ప్యాలెస్‌ ప్రత్యేకత. పదిహేనవ శతాబ్ధిలో ప్రారంభమైన దసరా ఉత్సవాలు అత్యాధునిక కాలంలో కూడా అవే సంప్రదాయాలు, సంస్కృతులతో నిర్వహిస్తారు. అయిదు శతాబ్ధాల చరిత్ర ఉన్న మైసూర్‌ దసరా ఉత్సవాలపై ప్రత్యేక కథనం... 

మైసూరులోనే అంత ఘనంగా దసరా ఉత్సవాలను ఎందుకు జరుపుకుంటారు? దసరా రోజున చాముండేశ్వరి దేవి చేతిలో హతమైన మహిషాసురుడి పేరు నుంచే మైసూర్‌ అని పేరు వచ్చిందని చెబుతారు. దసరా శరన్నవరాత్రుల్లో విజయ దశమి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. మైసూరు దసరా ఉత్సవాలకు దేశం నలు మూలల నుంచి కాకుండా విదేశీయులు సైతం పెద్ద యెత్తున హాజరవుతారు. 

అమ్మవారికి పూజలు, రాజదర్బార్‌, ప్యాలెస్‌ హంగులు ఒక్కటే మైసూరు దసరా ఉత్సవాలకు ప్రత్యేకత తీసుకొని రాలేదు. దసరా ఉత్సవాల్లో నిర్వహించే పోటీలు, రాజ సంబరాల్లో సామాన్యులకు ఇచ్చే ప్రాధాన్యత, అలంకరణలు, నృత్యాలు మైసూరు సంబరాలకు ప్రాముఖ్యత తెచ్చాయి. మైసూరు ఉత్సవాలను, సంబరాలను నిర్వహించేది రాజులే అయినా... యావత్‌ ఉత్సవ కాలంలో ప్రజల ప్రాతినిథ్యం కారణంగా కూడా వీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. 

మైసూరు దసరా ఉత్సవాలంటే రాజుల సంప్రాదాయమే కాకుండా ప్రజల సంబరాలు అంబరాన్ని తాకుతాయి. పాశ్చాత్య దేశాల్లో నిర్వహించే కార్నివాల్‌ స్థాయిని మించి పది రోజులూ వందలు, వేలు, లక్షల్లో ప్రజలు మైసూరు సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. అనేక సాంస్కృతిక కళా విన్యాసాలతో పాటు మల్ల యుద్ధ పోటీలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

కర్నాటక రాష్ట్ర పండగ అంటే అది దసరా కాదు. కర్నాటక రాష్ట్ పండగ అంటే మైసూరులో నిర్వహించే దసరా ఉత్సవాలే. అందుకనే రాజులు పోయినా, రాజ్యాలు పోయినా... మైసూరు ప్యాలెస్‌ ఉత్సవాలు ప్రజా సంబరంగా నిలవడానికి ఎన్నో కారణాలున్నాయి. రాజుల స్థాయిలో వేడుకలు, అదే సమయంలో సామాన్యుల స్థాయికి తగ్గ సంబరాలు మైసూరు దసరా ప్యాలెస్‌ ఉత్సవాల ప్రత్యేకత. అందుకే జీవితంలో మైసూరు ప్యాలెస్‌లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు మినీ భారత్‌ను ఆవిష్కరిస్తాయి. భిన్న సంస్కృతులు, సంప్రదాయాల భారతీయ నాగరికతకు సజీవ దర్పణంగా నిలుస్తాయి. జీవితంలో ఒక్కసారైన మైసూరు దసరా ఉత్సవాలను చూడాలని తపిస్తుంటారు. దసరా అంటే మైసూరు... మైసూరు అంటే దసరా. 

Similar News