ఏపీ విభజన హామీల అమలుకోసం కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవుతోంది టీడీపీ. మరోసారి అవిశ్వాస అస్త్రాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇప్పటికే అవిశ్వాసానికి మద్దతు తెలపాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు పలు పార్టీల నేతలని కోరారు. ఈ పక్షంలో ఈ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగున్నాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సభా కార్యకలాపాలు సజావుగా నిర్వహించేందుకు విపక్షాలు సహకరించాలని కేంద్రం కోరింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు విపక్ష నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో టీడీపీ తన స్పష్టమైన వైఖరిని కేంద్రానికి వెల్లడించింది. కేంద్రంపై మళ్లీ అవిశ్వాస అస్త్రాన్ని సంధించింది. విభజన హామీల సాధన కోసం కేంద్రంపై పోరాటాన్ని తీవ్రతరం చేసిన టీడీపీ తాజాగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది.
ఇప్పటికే టీడీపీ ఎంపీలు పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల నేతలతో భేటీ అయి తమకు మద్దతుగా నిలవాలని కోరుతూ చంద్రబాబు రాసిన లేఖను వారికి అందజేశారు. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. సభా కార్యకలాపాల జాబితాలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని చేర్చాలని కోరారు.
హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించి ఏపీకి పూర్తి స్థాయిలో అన్యాయం చేశారని, ఎన్డీయే అధికారంలోకి వస్తే ఏపీకి పూర్తిగా న్యాయం చేస్తామని, తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసుండాలనే రీతిలో వ్యవహరిస్తామని బీజేపీ ఆనాడు తెలిపిందని టీడీపీ నేతలు ఆరోపించారు. నాలుగేళ్లుగా ఎంత వేచిచూసినా, కేంద్రానికి ఎంతగా సహకరిస్తూ వస్తున్నా ఏపీకి అన్యాయమే చేశారు తప్ప ఎక్కడా రాష్ట్రాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు.
ఇక అవిశ్వాస తీర్మానంపై టీడీపీ మద్దతు కోరిందని, ఆ నిర్ణయం తమ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకుంటారని టీఆర్‌ఎస్ నేత జితేందర్ రెడ్డి అన్నారు. అందరూ కలిసి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలన్నారు. అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఆయన ఈసారైనా సమావేశాలలో సమస్యలపై చర్చ జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రానికి సంబంధించి బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్, ఐఐఎం వంటి ఎన్నో సమస్యలున్నాయని, వాటన్నిటిపై చర్చ జరగాలన్నారు జితేందర్ రెడ్డి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ ఎంపీ బుట్టా రేణుకను ఆహ్వానించడంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బుట్టా రేణుకపై అనర్హత పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉందని, తమ పార్టీ నుంచి అధీకృత లేఖ లేకుండానే ఆమెను ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. అయితే బీజేపీ, టీడీపీలు కలిసే ఈ పని చేశాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. తాజాగా టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంతో ఈ వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది.