హైద్రాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. నాల్గవ రోజు సభల్లో టాలివుడ్ ఫిల్మ్ స్టార్స్ తళుక్కుమన్నారు. పోతన పద్యాలతో ప్రారంభమైన కార్యక్రమం..ఆహుతలను అలరించింది. సి.నారాయణరెడ్డి రాసిన 15 పాటలతో 60 మంది సింగర్స్ తో ఏర్పాటు చేసిన మ్యూజికల్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
టాలివుడ్ స్టార్స్ అంతా ఒకే వేదికపై సందడి చేయడంతో ప్రపంచ తెలుగు మహాసభలకి మరింత శోభ సంతరించుకుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తో పాటు సీనియర్ నటీనటులంతా వేదికపై కనువిందు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఫిల్మ్ స్టార్స్ ని సత్కరించారు.
ప్రపంచ తెలుగు మహాసభల వేదిక పై తెలుగు నటీనటులంతా..తెలుగు భాషపై తమ మమకారాన్ని చాటుకున్నారు. మహాసభలకి నటీనటులను పిలిచి గౌరవించడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరు తెలుగు వాళ్లు మాట్లాడుకుంటే..తెలుగులోనే మాట్లాడుకోవాలని చిరూ పిలుపునిచ్చారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..సీఎం కేసీఆర్ ని ఆకాశాకెత్తేశాడు. తెలుగు భాషని అంతా మరచిపోతున్న తరుణంలో..సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభల్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారని పొగడ్తల వర్షం కురిపించారు.
నటసింహం బాలకృష్ణ..ఎప్పటిలాగే తన మాటలతో ఆందరినీ ఆకట్టుకున్నాడు. ప్రాంతాలుగా విడిపోయినా..తెలుగుజాతంతా ఒక్కటే అన్నారు బాలయ్య.
ఆర్. నారాయణ మూర్తి ఏ స్టేజ్ పై మాట్లాడినా..దద్దరిల్లాల్సిందే. ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై ప్రసంగించిన ఆర్. నారాయణ మూర్తి..సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
సినిమాల్లో కామెడీతో నవ్వించే బ్రహ్మానందం..తెలుగు మాస్టార్ లా మారిపోయారు. ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై బ్రహ్మానందం పద్యాలతో అదరగొట్టారు.
సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు..డైరెక్టర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ వరకు టాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం..ప్రపంచ తెలుగు మహాసభల వేదిక సాక్షిగా.. తెలుగు భాష గొప్పతనంపై అద్భుతంగా మాట్లాడారు. మాతృభాషపై ప్రేమని చాటుకున్నారు.