ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ నగర పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. ప్రధాన మంత్రిని నరహంతకుడని వ్యాఖ్యానించడంపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు, పబ్లిసిటీ కోసం ప్రముఖులపై విమర్శలు చేస్తున్న అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో రాజాసింగ్ ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు సానుకూలంగా స్పందించారు.
ట్విట్టర్‌లో తనపై రాజాసింగ్ ఫిర్యాదు విషయం తెలుసుకున్న కత్తి మహేష్ ‘‘చట్టం తెలియని ఒక ఎమ్మెల్యే నా మీద ఆన్‌లైన్లో పోలీసులకి కంప్లయింట్ చేసినంత మాత్రాన ఏమీ కాదు. ఎవరు కంగారు పడకండి. ఆ కంప్లయింటు చెల్లదు. అది అసలు కేసే కాదు. నాకు చట్టం గురించి బాగా తెలుసు. డోంట్ వర్రీ’’ అంటూ ట్వీట్ చేశాడు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శించే క్రమంలో‘మోడీ లాంటి నరహంతకుడితో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన నిన్ను, మతోన్మాద శక్తులతో చెయ్యి కలపకు అన్న శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా! ప్రధానమంత్రి అయినంత మాత్రమేనా మోడీ గుజరాత్ లో చేసింది రైట్ అయిపోతోందా? నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్.’’ అంటూ నరేంద్ర మోదీపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.