కోస్తాంధ్రకు పెథాయ్ తుఫాను ముప్పు తప్పింది. ముందుగా ఊహించిన దానికంటే తీఫాను తీవ్రత తక్కువగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ తుఫాను రెండు సార్లు తీరం దాటడం విశేషం.. మొదట తూర్పుగోదావరి జిల్లా యానాం–కాకినాడ మధ్య సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు తుపాను తీరం దాటగా.. తుని వద్ద రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్యలో మరోసారి తీరం దాటింది. నిన్న మధ్యాహ్నం 12.25 గంటలకు తాళ్లరేవు–కాట్రేనికోన మధ్య తీరాన్ని తాకిన పెథాయ్ కొంత కొంత బలహీనపడుతూ వచ్చింది.
కాకినాడ వద్ద తీరం దాటిన సమయంలో తీవ్ర వాయిగుండంగా మారి దిశను మార్చుకుని తిరిగి బంగాళాఖాతంలోకి మళ్లింది. అయితే తుని వద్ద రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్యలో మరోసారి తీరం దాటడంతో మళ్ళీ అధికారుల్లో అలజడి మొదలయింది. కానీ అప్పుడు కూడా తీవ్ర తుఫానుగా ఉన్న పెథాయ్ క్రమ క్రమంగా బలహీన పడుతూ.. ఒడిశా వైపు పయనించింది. దాంతో కోస్తాంధ్రకు పెథాయ్ ముప్పు తప్పినట్టయింది.అయితే గడచిన మూడు రోజులుగా పెనుగాలుల వేగం గంటకు 110 కిలోమీటర్లకు చేరుకుంటుందని వాతావరణ శాఖ హెచ్చరించగా తుపాను తీరం దాటేసరికి ఆ వేగం 50–70 కి.మీ మించలేదు.