ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అంటూ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు. 2019 ఎన్నికల్లో బరిలోకి దిగుతానంటూ ప్రకటించడంతో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. గెలుపుకంటే బంపర్ మెజార్టే లక్ష్యంగా నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాత, తండ్రి, మామ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోటు నుంచి పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్న సీఎం తనయుడు నారా లోకేష్ 2019 ఎన్నికలపై దృష్టి సారించారు. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఆయన 2019 ఎన్నికల్లో తాను కూడా బరిలోకి దిగుతానంటూ ప్రకటించి కొత్త చర్చకు తెరలేపారు.
1989 నుంచి తండ్రి వరుస విజయాలు సాధిస్తున్న కుప్పం నుంచే లోకేష్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తొలి అడుగులో బంపర్ మెజార్టీతో విజయం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాలని భావిస్తున్న లోకేష్ అందుకు కుప్పమే సరైన వేదికగా భావిస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు టీడీపీ పూర్తి స్ధాయిలో విజయం సాధించిన దాఖలాలు లేవు. టీడీపీతో పోల్చుకుంటే కాంగ్రెస్, వైసీపీలే ఎక్కువ సీట్లు సాధించడంతో చంద్రబాబు పునరాలోచనలో పడినట్టు సమాచారం.
లోకేష్ పోటీ చేస్తానంటే హిందూపురం సీటు త్యాగం చేస్తానంటూ ఇది వరకే ప్రకటించిన మామ బాలయ్య తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదంటూ మరోసారి ప్రకటించారు. ఇప్పటివరకు హిందూపురంలో టీడీపీకి తిరుగులేకపోవడంతో బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తారని కేడర్ కూడా భరోసానిస్తోంది. అయితే గెలుపు ఖాయమైనా మెజార్టీ విషయంలో కొందరు నేతలు సందేహాలు వ్యక్తం చేస్తుండటంతో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఉంది. టీడీపీకి కంచుకోటగా గుడివాడ ఇటీవల టీడీపీ చేజారిపోయి వైసీపీకి దక్కింది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలని నారా లోకేష్ భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసిన ఆయన గెలుపే లక్ష్యంగా టీం వర్క్ చేస్తున్నారు. ఈ విజయం ద్వారా తాత రాజకీయ వారసత్వానికి తానే వారసుడిగా ప్రచారం చేసుకోవచ్చని భావిస్తున్నారు.