సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ కు కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని సస్పెండ్ చేయటంతోపాటు, ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ‘నీచ్ ఆద్మీ’ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాగా, మణిశంకర్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని అయ్యర్ పై విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ కీలక నేతలు ఒక్కోక్కరుగా మణిశంకర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థామయిలో మండిపడ్డారు కూడా. పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేస్తోందని ప్రశ్నించారు. చివరకు ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించటంతో దిగొచ్చిన మణిశంకర్ అయ్యర్ కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
2014 లో నరేంద్ర మోదీని ‘చాయ్‌వాలా’ అంటూ హేళన ఆయన తాజాగా మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. అంబేద్కర్ ఆశయాలకు వాస్తవ రూపం తేవడానికి జవహర్‌లాల్ నెహ్రూ కృషి చేశారని, అటువంటి కుటుంబంపై ప్రధాని మోదీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఆయన నీచుడు, సభ్యత లేనివాడు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు.