తలుపులు బద్దలవుతున్నాయి. దిష్టిబొమ్మలు దగ్ధమవుతున్నాయి. శాపనార్థాలు హోరెత్తుతున్నాయి. ప్రళయం తప్పదన్న హెచ్చరికలు పెళ్లుమంటున్నాయి. భూకంపం సృష్టిస్తామన్న కేకలు కెవ్వుమంటున్నాయి. అభ్యర్థులపై కేవలం టీజర్ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే, హస్తం బాక్సాఫీసు అల్లకల్లోలమవుతోంది. మహాకూటమిలో సీట్ల పంపకం కాంగ్రెస్‌లో కల్లోలం రేపడం అప్పుడే మొదలైంది. కేవలం ఎన్ని స్థానాలు, ఏయే పార్టీకి ఖరారయ్యాయో, ప్రకటించిన కాంగ్రెస్, ఎవరికి ఏ సీటో లీకులుస్తుండటంతో, ఆశావహులకు షాక్ తగులుతోంది. దీంతో అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్ అసంతృప్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
ఏళ్లతరబడి కాంగ్రెస్ కోసమే కష్టపడి, త్యాగాలు చేసి, ఈసారైనా తమకు సీటు వస్తుందనుకుని, అనధికారికంగా ప్రచారం చేసి, ఇప్పుడు కూటమి కారణంగా, ఇతర పార్టీలకు సీటు ఇవ్వడాన్ని, కాంగ్రెస్ ఆశావహులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్‌లో ఆందోళనలు ప్రారంభించారు. ఢిల్లీలో మకాం వేసిన ఆశావహులు ఓవైపు ప్రయత్నాలు చేస్తుండగానే .. రాష్ట్రంలో పలు చోట్ల కార్యకర్తలు నిరనసలకు దిగారు. మల్కాజ్‌గిరి టికెట్, టీజేఎస్‌కు కేటాయించారంటూ వస్తున్న వార్తలపై, పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. టికెట్ నందికుటం శ్రీధర్‌కే ఇవ్వాలంటూ కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసనకు దిగారు. టిక్కెట్ల సెగ, కాంగ్రెస్ సీనియర్ నేతలకు తాకుతోంది. నార్కట్‌పల్లిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తల ఆందోళనపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి...నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకుంటే నల్గొండలో తాను పోటీ చేయనని తేల్చి చెప్పారు. పొత్తుల పేరుతో నకిరేకల్‌ను వేరొకరికి ఇస్తే చూస్తూ ఉరుకోబోమన్నారు. జరగబోయే పరిణామాలకు ఉత్తమ్, జానారెడ్డి బాధ్యత వహించాలని వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి. అటు మహాకూటమి పొత్తులపై ఎమ్మెల్సీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలో ఇప్పటి వరకు సీట్ల కేటాయింపులు మాత్రమే పూర్తయ్యాయని .. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. కూటమిలోని అన్ని పార్టీలు పొత్తు ధర్మాన్ని పాటించాల్సి ఉందన్న ఆయన ... ఎవరూ చెప్పక ముందేే ఖమ్మంలో టీడీపీ నేత నామా నాగేశ్వరరావు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. టికెట్ల కేటాయింపులో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్న పొంగులేటి ... ప్యారాచ్యుట్ నేతలకు అవకాశం ఇచ్చే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలన్నారు.
ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న వార్తలపై, వివిధ నియోజకవర్గాల్లో ఆశావహులు టెన్షన్ టెన్షన్ పడుతున్నారు. అధికారికంగా జాబితా వెల్లడైన తర్వాత, తమకు అందులో చోటు దక్కకపోతే, తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. అటు ఢిల్లీలోనూ ఆశావహులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీలకు టిక్కెట్లివ్వాలని, లేదంటే తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగుతామని వార్నింగ్ ఇస్తున్నారు. అభ్యర్థులు, స్థానాలు, ఇంకా అధికారికంగా ఖరారుకాకముందే, ఇలా నిరసనాగ్నులు భగ్గుమంటుంటే, ఇక అఫిషియల్‌గా ప్రకటించిన తర్వాత, కాంగ్రెస్‌లో నిజంగా భూకంపమే వచ్చేట్లు ఉంది. కాంగ్రెస్‌లో ఒక్కో స్థానం నుంచి ముగ్గురు, నలుగురు టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ బీఫాం దక్కకపోతే, రెబల్‌గా బరిలోకి దిగడమో, ఇతర పార్టీల్లోకి జంప్ కావడమే ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రాహుల్ గాంధీ ఆదేశాలతో సీినియర్ నేతలు అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తు ధర్మం తప్పదని అంటున్నారు. అయినా ఆశావహులు మాట వినేలా లేరు. ఆందోళనలు మిన్నంటే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకు గాంధీ భవన్ దగ్గర హోరెత్తిన నిరసనే టీజర్. ఇప్పటికే గాంధీ భవన్‌కు ఫుల్ సెక్యూరిటీ కల్పించారు. గతంలో మాదిరి ఫర్నీచర్, కంప్యూటర్లు ధ‌్వంసం కాకుండా, ఎవరూ ఆత్మహత్యాయత్నం చేయకుండా, భద్రతను కట్టుదిట్టం చేశారు. చూడాలి, రానున్న రెండు, మూడు రోజుల్లో, కాంగ్రెస్‌లో ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో....