సర్వేల భయం కూటమిని కుదిపేస్తోందా?

Update: 2018-09-18 08:17 GMT

మహాకూటమిని సర్వేల భయం వెంటాడుతంది. ఇంకా తెగని పొత్తుల చర్చలతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఇంకా తేలని సీట్ల పంపకాలతో కూటమి పార్టీలు ఆలోచనల్లో పడ్డాయి. అంతర్గత సర్వేల తర్వాతే ఒప్పందం అంటున్న నేతలు... బలమైన స్థానాలు తమవంటే తమవంటూ పట్టుపడుతున్నారు. బలమున్న స్థానాలను వదులకోవద్దన్న రాహుల్‌ దిశానిర్దేశంతో కాంగ్రెస్‌ శ్రేణులు త్యాగాలు చేయలేమంటున్నాయి. దీంతో సీట్ల పంచాయతీతో కూటమి పార్టీలు ఎవరికీ భరోసా ఇవ్వలేకపోతున్నాయి.

బలమైన స్థానాల్లో 25- 30 సీట్లు అడుగుతున్న తెలంగాణ టీడీపీ- 30 స్థానాల్లో బలంగా ఉన్నామంటుంది. అలా కుదరదంటున్న తెలంగాణ కాంగ్రెస్.. .15 మాత్రమే ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదంటున్న టీ-టీడీపీ.. ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు, సంప్రదింపులు జరుపుతోంది. 

ఇటు సీపీఐ, జనసమితి మహాకూటమిలో జతకట్టనున్నట్టు తేల్చిచెప్పేశాయి. సీట్లో ఎన్నో తేలాకే జనంలోనికి వెళ్తామంటున్నారు నేతలు. మొత్తంగా బలాబలాలు తేల్చే పనిలో పడ్డాయి కాంగ్రెస్, టీటీడీపీ. కూటమిలో 7 నుంచి 8 స్థానాలు సీపీఐ కోరుతుంటే... 15-18 స్థానాలు జన సమితి ఆశిస్తుంది. ఇదంతా ఒక ఎత్తయితే ఎవరి నాయకత్వంలో పనిచేయాలన్న దానిపై కూటమి పార్టీలు క్లారిటీ రాక ఇంకా కన్ఫ్యూజన్‌లో ఉండటం కొసమెరుపు. 

Similar News