స్త్రీలు-పురుషులు ఇద్దరూ సమానమే కానీ. పురుషులు కాస్త ఎక్కువ సమానమని, సినిమాలో ఓ డైలాగ్ ఉంది. కానీ తెలంగాణలో దాదాపు 50 నియోజకవర్గాల్లో, పురుషుల కంటే మహిళల కాస్త ఎక్కువ సమానం. కానీ రాజకీయ పార్టీలు మాత్రం మహిళా సూత్రాన్ని పాటించలేదు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు స్త్రీలకు కేటాయించిన స్థానాల్లో అతి తక్కువ స్థానాలు దక్కించుకున్నది మహిళామణులే.
మహిళా సాధికారత గురించి పదే పదే గొప్పలు చెప్పే పార్టీలు.. ఎన్నికలు వచ్చేసరికి చూపించిన చిత్తశుద్ధి ఇది. తెలంగాణలోని అత్యధిక నియోజకవర్గాల్లో, మహిళా ఓటర్లే అధికం. ఈ విషయం చెబుతున్నది సాక్షాత్తు ఎన్నికల కమిషన్. మొత్తం ఓటర్ల డేటా విశ్లేషించిన ఈసీ, రాష్ట్రంలోని 50 నియోజకవర్గాల్లో పురుషుల కంటే, మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని లెక్క తేల్చేసింది. అయినా మహిళలకు దక్కిన గౌరవం మాత్రం ఇదా అంటున్నారు అతివలు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా నిలుస్తున్న మహిళలకు రాజకీయాల్లో మాత్రం అడ్డుగోడలు తొలగడం లేదు. అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నా ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో మాత్రం మొండిచేయే చూపిస్తున్నారు. మగవారి కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా మహిళా నేతలకు అవకాశాలు దక్కడం లేదు.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ కలిపినా పోటీలో ఉన్న మహిళా అభ్యర్థుల సంఖ్య కేవలం 40. 119 నియోజకవర్గాల సంఖ్య ఆధారంగా చూసినా.. ఇది 33 శాతానికి తక్కువే. సామాజిక కట్టుబాట్లను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్నా గొంతు వినిపించే అవకాశాన్ని పార్టీలు ఇవ్వడం లేదంటూ మహిళా నేతలు నిప్పులు చెరుగుతున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మహిళలకే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ప్రాతినిధ్యం కల్పించిందన్న విమర్శలున్నాయి. కరీంనగర్ కొత్త జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా...వాటిలో చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్‌లో మహిళా ఓటర్లే అధికం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. మహిళా ఓటర్లు అధికంగా ఉన్నందుకే, అన్నీ పార్టీలూ వారికి వరాలు ప్రకటించినా... ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి.