సీట్లు, ఓట్లు.. ఓట్ల సంగతి అటుంచితే మహాకూటమిలో ఇప్పటికీ సీట్లైతే తేలలేదు.. ఒంటరిగా పోటీ చేయడంకన్నా అందరిని కలుపుని తెరాస ను ఓడించాలని అనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో ఆ పార్టీ ఆధ్వర్యంలోనే మహాకూటమి ఏర్పాటు చేసింది. గత పదిరోజుల నుంచి కాంగ్రెస్, టీడీపీ, జనసమితి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఎంతకీ తెగలేదు. రెండు రోజుల్లో తమకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో చెప్పకుంటే కూటమినుంచి వైదొలుగుతామని ఒకవైపు కోదండరాం హెచ్చరిస్తుంటే.. మరోవైపు సెటిలర్స్ నియోజకవర్గాల్లో సీట్లు మాకంటే మాకు కావాలని పోటీపడుతున్నాయి కాంగ్రెస్, టీడీపీలు. అందులో ముఖ్యంగా కూకట్ పల్లి నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రాంత ఓటర్లు అధికంగా ఉన్నారు.ఇక్కడ తామే పోటీ చేస్తామని కాంగ్రెస్, లేదు తమకే కేటాయించాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఇటీవల నగరానికి విచ్చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సీటు విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు క్లాస్ తీసుకున్నారట. ఇక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన బలమైన నేతను పోటీకి దింపాలని సూచించారట. అయితే ఈ నియోజకవర్గంనుంచి టికెట్ ఆశిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి. గతఎన్నికల్లోప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అయన.. ఆ ఎన్నికల్లో మంచి ఓట్లనే సాధించారు. ప్రస్తుతం తెలంగాణలో పోటీ చేసేందుకు ఉవ్విళూరుతున్నారు. ఏపీకాంగ్రెస్ నేతలు కూడా రామచంద్రారెడ్డికె మద్దతు తెలుపుతున్నారట. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రులు సైతం ఏలూరికే మద్దతు తెలుపుతున్నారు. దాదాపు 20 ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న నేతకు న్యాయం చెయ్యాలని.. పైగా కూకట్ పల్లి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ కలిగి ఉన్నందున ఆ సీటు అతనికే కేటాయించాలని కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ టీపీసీసీకి చెబుతున్నారట. అయితే ఏలూరికి ఈ సీటు కేటాయించడం పెద్ద కష్టమేమి కాకున్నా.. టీడీపీని ఎలా ఒప్పించాలా అని తర్జనభర్జన పెడుతోందట. ఇక్కడినుంచే పోటీ చెయ్యాలని అనుకుంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆయనకు మద్దతు పలుకుతున్నారు. మరి కూకట్ పల్లి టికెట్ ఏపీ కాంగ్రెస్ నేతలు సూచిస్తున్న వ్యక్తికి కేటాయిస్తారా లేక టీడీపీకి త్యాగం చేస్తుందో చూడాలి.