కూటమిలో సీట్ల కుంపటి.. ఎందుకీ కోదండ ప్రకంపనలు

Update: 2018-10-20 05:37 GMT

తెలంగాణ కాంగ్రెస్...మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై  తన పెత్తనం సాగించాడానికి ప్రయత్నం చేస్తోందా...సీట్ల విషయంలో బెట్టుదిగని కోదండకు, దండం పెట్టడానికి హస్తం పార్టీ ప్లాన్ చేసుకుంటోందా....చివరిదాక లాగి వదిలేయడానికి గాంధీభవన్‌ ఆలోచిస్తోందా... కూటమిలో కోదండ వ్యవహారం మింగుడుపడంలేదా? టీఆర్ఎస్‌ను ఢీకొనడానికి కూటమిగా జట్టుకట్టాలని భావించిన కాంగ్రెస్, అనేక పార్టీలను ఒకే గొడుగు కిందకు తెచ్చింది. బీజేపీ, సీపీఎం మినహా మిగతా పార్టీలు అంటే తెలుగుదేశం, సిపిఐ, జనసమితి పార్టీలతో, మహాకూటమిగా ఏర్పడింది. కానీ కూటమిలో టీడీపీ, సీపీఐలు ఎలాంటి బెట్టూ చేయకపోయినా, కోదండరాం నేతృత్వంలోని జనసమితి మాత్రం, అనేక అంశాల్లో బెట్టు చేస్తుండటం, కాంగ్రెస్‌ను ఇబ్బంది పెడుతోంది.

కాంగ్రెస్‌ ఇప్పటికే అనకే హామీలను ప్రజల్లో ఉంచింది. కానీ అమరుల ఆశయాలే అజెండాగా ఉండాలని భావిస్తున్న టీజేఎస్, కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనికి కాంగ్రెస్‌ సైతం ఓకే చెప్పింది. కానీ అంతటితో ఆగలేదు కోదండరాం. కూటమి ఛైర్మన్ పదవి, తనకే ఇవ్వాలని షరుతు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక్కడే కూటమిలో కల్లోలం మొదలైంది. కూటమి ఛైర్మన్‌ పదవి ప్రతిపాదనకు కాంగ్రెస్, టిడిపిలు ససేమిరా అన్నాయి. ఈ పదవి సాధ్యం కాదని కాంగ్రెస్ ఖరాకండిగా చెప్పేసింది. దీంతో కూటమలో విభేదాలు పెరిగాయన్న ప్రచారం జరిగింది.

ఇక సీట్ల సర్దుబాటుపై జనసమితి తీరు ఎవ్వరికీ మింగుడుపడడంలేదని జోరుగా చర్చ జరుగుతోంది. శక్తికి మించి, జనసమితి అడుగుతోందన్న గుసగుసలు వినిపించాయి. మొదటి ప్రతిపాదనగా 36 సీట్లు అడిగిందని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. తరువాత చర్చల్లో 17 సీట్లకు వచ్చింది కానీ, కాంగ్రెస్ మాత్రం టిజేఎస్ తీరుపై తీవ్రంగా మండిపడుతోంది. పదేపదే టిజేఎస్‌ను బుజ్జగించే ప్రయత్నం చేసినా... కోదండ బెట్టుదిగకపోవడంతో, హస్తం పార్టీ కోదండ తీరుపై ఆగ్రహంతో రగిలిపోతోంది. పార్టీలో ఇద్దరు ఎవరు కలిసినా, కోదండకు అన్ని సీట్లు ఎందుకునే విషయాన్ని చర్చించుకుంటున్నారు. టిజేెఎస్ అడిగినన్ని సీట్లు ఇస్తే, టిఆర్ఎస్‌కు మేలు చేయడమేనని కొందరు వాదిస్తున్నారు. అందుకే, కోదండరాం పార్టీకి ఇచ్చే సీట్లలోనూ, కాంగ్రెస్ గుర్తుపైనే పోటిచేయాలని ప్రతిపాదించింది. దీనిద్వారా కొత్త గుర్తుకాకుండా కాంగ్రెస్, తరపున గెలువడం ఈజీ అవుతుందనే భావనలో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

టిజేఎస్ విషయంలో, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనపడుతోంది. ఉమ్మడి ఎజెండాతో కాలయాపన చేసి చివరిదాకా, కూటమిలో టిజేఎస్‌తో చర్చలు జరపాలని, అప్పటికి కోదండరాం దిగిరాకపోతే, చివరి సమయంలో కటీఫ్‌ చెప్పాలని భావిస్తోంది కాంగ్రెస్. అందుకు కారణాలను కూడా ప్రజలకు వివరించాలని ప్రిపేర్‌ అవుతోంది. తాము ఉద్యమకారులను కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేసినా, కోదండరాం కలిసి రాకుండా వెళ్లిపోయారనే భావన కల్పించాలని ఆలోచిస్తోంది. పార్టీలో నేతలు సైతం కోదండ కోరికలు భరించలేమని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఎనిమిది సీట్ల ప్రతిపాదను టిజేఎస్ తిప్పి పంపండంతో చివరకు టీజేఎస్‌ను వదిలేసుకోవాలన్న భావనకు కాంగ్రెస్ వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రతిపాదనను కోదండ అంగీకరించపోతే, చివరికి దూరం చేసుకోకతప్పదని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. అటు కోదండరాంకు కూడా, కాంగ్రెస్ తప్ప ఏ ఇతర పార్టీలతో కలిసి పోయే పరిస్థితి లేదు. ఒంటరిగా బరిలోకి దిగేందుకు శక్తి లేదు. బీజేపీ ఆహ్వానమున్నా, అధికార, విపక్షాలకు అది శత్రువు కావడంతో, వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత్యంతరం లేకే, కోదండరాం కూటమిలో సర్దుకోక తప్పడంలేదు. ఒకవేళ కోదండ అడ్జస్ట్‌ కాకపోతే, చివరికి టిఆర్ఎస్ కోవర్టు అనే ముద్ర వేసేందుకు కూడా కొందరు నేతలు సిద్దమవుతున్నారు. అన్ని విధాల కూటమిని తన చేతుల్లో పెట్టుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆలోచిస్తోంది కాంగ్రెస్. ఇలా కూటమిలో కోదండపై రకరకాల చర్చ జరుగుతోంది.

Similar News