కోదండరామ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?

Update: 2018-07-27 05:45 GMT

తెలంగాణ ఉద్యమ సమయంలో కార్యకర్తలకు బలన్నిచ్చారు రాష్ట్ర సాధన తర్వాత ఇక బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్నా నంటున్నారు ఇన్నాళ్లూ ఉద్యమాలకే పరిమితమైన ఆ ప్రొఫెసర్ ఇప్పుడో రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు ఇంతకీ ఆయన పోటీ చేసేదెక్కడ నుంచి?

ఇన్నాళ్లూ ప్రజా ఉద్యమాలను మలిచారు తానే ముందుండి తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చారు స్వరాష్ట్రం వచ్చాక ఇక తెలంగాణ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. ఉద్యమం చేసినంత సులభం రాజకీయం కాదని ఆయనకు చాలా తొందరగానే అర్ధమైంది. అందుకే ఉద్యమంలో కలసి వచ్చిన వారందరినీ కూడగట్టుకొని ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మరీ ఉద్యమిస్తోంది తెలంగాణ జనసమితి. పార్టీ స్థాపించి కొన్ని నెలలు గా తమకు బలమున్న ప్రాంతాల్లో విరివిగా పర్యటనలు చేస్తున్నారు. జన్మనిచ్చిన ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా ఉద్యమ పాఠాలు నేర్పిన ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా కోదండ రామ్ రాజకీయాలు నడుపుతున్నారు వచ్చే ఎన్నికల్లో కోదండరామ్ పార్టీ ఉత్తర తెలంగాణలో అధిక స్థానాల్లో దక్షిణ తెలంగాణలో బలమున్న చోట బరిలో దిగాలని చూస్తోంది . అందులో 50 నుంచి 70 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని జన సమితి నేతలంటున్నారు.

ఇంతకీ కోదండ రామ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? తాను పుట్టిన మంచిర్యాల నుంచా లేక ఉద్యమం ఉథృతమైన వరంగల్ నుంచా అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. కానీ ఆయన మాత్రం తన బాల్యం మొత్తం గడిచిన వరంగల్ వెస్ట్ నియోజక వర్గం ఎంచుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చదువు, ఉద్యమ పాఠాలు నేర్పిన వరంగల్ వెస్ట్ అయితే తనకు సరిగ్గా ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అక్కడ ప్రజల్లో తిరుగుబాటు తత్వం ఎక్కువ అదీకాక స్థానికంగా కలిసి వచ్చే అంశాలు ఆధారంగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో పోటే చేస్తే ఏలా ఉంటుందని పార్టీ నేతలతో సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ బలమైన నాయకులు లేకపోడంతో పాటూ తన గురువు ఉద్యమ పాఠాలు నేర్పిన జయశంకర్ సార్ పుట్టిన గడ్డ కూడా అని సెంటిమెంట్ గా ఆలోచిస్తున్నారట. మరోవైపు ప్రస్తుతం కోదండరాంతో కలిసి నడుస్తున్న మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గతంలో వరంగల్ వెస్ట్ నుండి పోటి చేసారు. ఇప్పుడు తన పార్టీ అధినాయకుని కోసం నియోజక వర్గంలో చురుగ్గా పనిచేస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

ఒకవేళ వరంగల్ వెస్ట్ కుదరకపోతే మరో ఆప్షన్ గా కోదండరామ్ సాయుథ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినగడ్డ జనగాం నుంచి బరిలోకి దిగాలని ఆయన అనుచరులు కోరుకుంటున్నారు. ఇప్పటికీ కోదండరాం కు అటు యూనివర్సిటీలోనూ, ఉద్యమంలోనూ  ఎక్కువ మంది శిష్యులు జనగామ వారే. అదీకాక జనగామ లో  కోదండరాం సామాజిక వర్గమైన రెడ్ల ఓట్లు ఎక్కువ కొత్త జిల్లాల ఎర్పాటులో జనగాంలోని కీలమైన చేర్యాలను ప్రభుత్వం విడగొట్టడం దేవాదుల ప్రాజెక్టు నీళ్లను స్థానిక అవసరాలకు కాక సిద్దపేటకు తరలించడంతో టిఆరెస్ పై  జనగామ లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలంగాణ జన సమితి నమ్ముతోంది. తెలంగాణ జన సమితి స్థాపించిన తరువాత కోదండరాం జనగామలో ఎక్కువగా ఉద్యమాలు చేసారు.. అందుకే కోదండరాం జనగామ నియోజక వర్గం మరో ఆప్షన్ గా పెట్టుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి తెలంగాణ జనసమితి నేతలు ఎన్నికలకోసం ప్రిపేర్ అవుతూనే తమ నేత నియోజక వర్గంపై ఆతృత ప్రదర్శిస్తున్నారు. మరోవైపు కోదండరామ్ ఏ సీటు ఎంచుకుంటారన్న అంశాన్ని  టిఆరెస్ కూడా నిశితంగా గమనిస్తోంది. కోదండరాం బరిలో దిగే నియోజక వర్గంలో బలమైన నాయకున్ని పోటీ పెట్టనున్నట్లు తెలుస్తోంది.    

 

Similar News