కేరళలో 80 శాతం భూభాగం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. ఎటు చూసినా వరద నీరే. ఇళ్లల్లోకి వరద నీరు ముంచెత్తుండటంతో ప్రజలు ఆందోళనతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది వరదల్లో చిక్కుకుపోతున్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని కొందరు రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు రక్షిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. పీకల్లోతు నీటిలో నిలబడి సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు కొందరు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
కేరళలో వరద సహాయ చర్యల్లో పాల్గొన్న ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ ప్రశాంత్ అత్యంత ధైర్యసాహసాలతో ఓ పసిబిడ్డ ప్రాణాలను రక్షించారు. వరద నీరు చుట్టుముట్టిన ఓ రెండతస్థుల భవనంపై ఉన్న చిన్నారిని.. కమాండర్ ప్రశాంత్ కాపాడిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. హెలికాప్టర్‌లో నుంచి తాడు సహాయంతో.. వరద నీటిలో చిక్కుకున్న బిల్డింగ్ పైకి దిగారు ప్రశాంత్. పసిబిడ్డను జాగ్రత్తగా చేతులతో పట్టుకుని, గట్టిగా పట్టుకున్నాడు. ఒక చేతితో తాడును, మరో చేతితో చిన్నారిని పట్టుకుని ప్రాణాలకు తెగించి ఆ బిడ్డను కాపాడాడు.
అప్పటికే హెలికాప్టర్‌లో ఏడుస్తూ ఉన్న తన తల్లికి ఆ బిడ్డను సురక్షితంగా అప్పగించాడు ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ ప్రశాంత్. అప్పటివరకు కన్నీరుమున్నీరైన ఆ తల్లి, తన బిడ్డ చేతుల్లోకి రాగానే ఆనందభాష్పాలు రాల్చింది. ప్రశాంత్ బిడ్డను కాపాడుతున్న దృశ్యాలు చూసిన వారంతా.. గ్రేట్ సెల్యూట్ టు ఆఫీసర్ అంటున్నారు.