అయ్యప్ప ఆగ్రహించాడా...అందుకే కేరళను...

Update: 2018-08-20 03:16 GMT

శబరిమలై అయ్యప్పకు ఆగ్రహం వచ్చిందా..? హరి హరుల సుపుత్రుడికి కోపం వచ్చిందా..? అందుకే కేరళను జలప్రళయం ముంచెత్తిందా..? వందేళ్లలో కనీవినీ ఎరుగని విధంగా మలయాలీ సీమను అల్లకల్లోలం చేసిన వరదలకు కారణం మణికంఠుడి శాపమా..? 

శబరి కొండల్లో కొలువైన అయ్యప్పస్వామి కోరి వచ్చిన వారికి కొంగు బంగారం. క్షీరసాగర మధనం తర్వాత మోహినీ అవతారంలో వచ్చిన విష్ణువును శివుడు మోహించడం ద్వారా అయ్యప్ప అవతరించాడని పురాణగాధలు చెబుతున్నాయి. మహిశాసురుని వధించేందుకు అవతరించిన అయ్యప్ప జ్యోతిస్వరూపంలో భక్తులకు అభయమిస్తాడు. 

41 రోజుల పాటూ కఠినమైన నియమాలతో దీక్షలు చేసిన భక్తులు 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకుంటారు. అయితే స్వామివారి దర్శనానికి ఆడవారికి ఆంక్షలున్నాయి. పదేళ్ల నుంచి 50 యేళ్ల మహిళలకు ఆలయ ప్రవేశం నిషేదం. దీనిపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు రావడం ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేయడం మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగిపోయాయి. 

అయితే సుప్రీంకోర్టు తీర్పుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైనా ప్రస్తుతం కేరళ వరదలతో ఈ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు మహిళల ఆలయ ప్రవేశం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అయ్యప్పస్వామి ఆగ్రహం పెంచుకున్నాడని.. అందుకే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలతో రాష్ట్రం అల్లకల్లోలం అవతుందనే వాదనలు భారీగా వినిపిస్తున్నాయి. ఇక సోషల్‌ మీడియా అయితే ఇదే విషయాన్ని కోడై కూస్తోంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్కుల్లో దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. అయ్యప్ప భక్తులు మాత్రం.. వరదలు కచ్చితంగా సుప్రీం తీర్పు వల్లే వచ్చాయని వాదిస్తుండగా మరికొందరైతే ప్రకృతికి ప్రకోపమే ఈ విలయానికి కారణమని చెబుతున్నారు. 
 

Similar News