గజ్వెల్ నుంచి ఎన్నికల బరిలో దిగిన కేసీఆర్....నామినేషన్ ఎప్పుడు వేస్తున్నారు. సెంటిమెంట్ కు ప్రాదాన్యత ఇచ్చే గులాబీ బాస్....తన అదృష్ట సంఖ్యకే ప్రాధాన్యమిస్తారా. ఈ నెల 15న నామినేషన్ దాఖలు చేస్తారా. కెసిఆర్ నామినేషన్ కు గులాబీ పార్టీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది. గజ్వేల్ నుంచి రెండోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు కేసీఆర్. ఈసారి ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధించాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఓవైపు తన పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం వ్యూహాలు రచిస్తోంటే...మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలో మండలానికొక ముఖ్యనేత ప్రచార బాధ్యతలు భుజానకెత్తుకున్నారు. ఇక మంత్రి హారీష్ రావు తన సొంతనియోజకవర్గం కంటే ఎక్కువగా అన్నీతానై చూసుకుంటున్నారు. తన మామ కెసీఆర్‌కు గెలుపుతో పాటు, భారీ మెజారిటీ సాధించి పెట్టడమే లక్ష్యంగా కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు.
కేసీఆర్ నామినేషన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈనెల 15న కేసీఆర్ నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. తనకు కలిసొచ్చే సంఖ్య ఆరు కాబట్టి, 15వ తేదీన నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి, అక్కడి నుంచే ప్రతిపక్షాలపై ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్‌కు ముందు సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత, నామినేషన్ దాఖలు చేశారు కెసీఆర్. ఈసారి కూడా కోనాయపల్లిలో దర్శనం చేసుకుని నామినేషన్ వేసేందుకు అట్టహాసంగా బయలుదేరతారని తెలుస్తోంది. ఇప్పటి నుంచే నామినేషన్‌కు సంబంధించి, గులాబీ దళం ఏర్పాట్లు చేస్తోంది.
కేసీఆర్ నామినేషన్ పర్వాన్ని గులాబీ పండుగలా నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేస్తోంది పార్టీ. కేవలం అదే నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గం మొత్తం గులాబి మయం చేసేలా చూడాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. నామినేషన్ తర్వాత గజ్వెల్ పట్టణంలో కేసీఆర్ ఎన్నికల ప్రసంగం కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేదికగానే ప్రతిపక్షాలను తీవ్రస్థాయిలో తూర్పార పట్టబోతున్నారు. సీఎం ఇలాఖాలో కాంగ్రెస్ గెలుస్తుందని ప్రతిపక్షాలు చేస్తోన్న ప్రచారాన్ని తిప్పకొట్టబోతున్నారు గులాబీబాస్. తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా...ముందుగా గజ్వేల్ నుంచే ప్రారంభించామని....పథకాలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరేలా చూశామని..అభివృద్ది ఫలాలను గజ్వెల్ పట్టణంలో ప్రతి ఒక్కరు రుచి చూశారన్న కోణంలో, కేసీఆర్ స్థానికంగా ప్రజలకు గుర్తు చెయ్యనున్నారు. ఇక గజ్వేల్‌లో నామినేషన్ అనంతరం ఇక తాను ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంతటా తిరగాల్సి ఉంటుందని....కాబట్టి ప్రజలు తన గెలుపుకు సహకరించాలని కోరనున్నట్లు తెలుస్తోంది.