కేసీఆర్ ముందస్తు ఎన్నికల సమర శంఖం పూరించారు. డిసెంబర్ లో ఎన్నికలు తధ్యమని సంకేతాలిచ్చారు. సెప్టెంబర్ లోనే అభ్యర్ధులను ప్రకటిస్తామన్నారు. అభ్యర్ధుల ఎంపిక కోసం పార్టీ సెక్రటరి జనరల్ కేకే అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసారు. ఎన్నికల కోసం పార్టీ కాడర్ ను సిద్దం చేయాలని పార్టీ రాష్ట కమిటీ నేతలను పిలుపు నిచ్చారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ముందస్తు సమరానికి సిద్ధం కావాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగానే సెప్టెంబర్ 2 న హైదరాబాద్ లో భారి బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని కేసీఆర్ సంకేతాలిచ్చారు. మంత్రి వర్గ సహచరులకు సమాచారం ఇవ్వకుండానే.. అసెంబ్లీ రద్దు చేయవచ్చని ప్రకటించడం ద్వారా ఏ క్షణంలోనైన అసెంబ్లీ రద్దు చేయవచ్చని పరోక్షంగా తెలిపారు.
షెడ్యుల్ ప్రకారమైతే అసెంబ్లీకి, పార్లమెంటు కు ఓకే సారి ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్లమెంటు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రావని చెప్పడం ద్వారా.. తెలంగాణకు ముందస్తు ఎన్నికలు తప్పవని కేసీఆర్ సంకేతాలిచ్చారు. డిసెంబర్ లో ఎన్నికలు తధ్యమని రాష్ట కమిటీ సమావేశంలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మద్య ప్రదేశ్, మిజోరాంతో పాటు డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తులుండవని ఒంటరి పోరేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేసారు. ఇది పార్టీ ఏకగ్రీవ నిర్ణయమని తెలిపారు. ఈసారి వంద సీట్లను గెలుచుకోవడం ఖాయమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని తెలిపారు.
తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, పార్టీ అధినేత సంకేతాలతో.. రాష్ట కమిటీ, క్యాడర్ ను ముందస్తు సమరానికి సిద్ధం చేయనుంది.