జడ్చర్లలో టీఆర్‌ఎస్... కాంగ్రెస్. ఈ రెండు పార్టీల మధ్యే పోటీ. ఇక్కడి నుంచి ఎప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే ఎర్రశేఖర్ ఈసారి మహబూబ్‍నగర్ నియోజకవర్గానికి వెళ్లడంతో మంత్రి లక్ష్మారెడ్డి, మల్లు రవిల మధ్య పోరు కొనసాగే అవకాశాలున్నాయి. మహాకూటమి పొత్తులు ఎలా ఉన్నా జడ్చర్లలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్టుగానే పోటీ ఉండేలా కనిపిస్తోంది.
మహబూబ్‍నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డి, మల్లు రవి అన్నట్టుగా పోటీ ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి టీడీపీ తరుపున పోటీ చేసే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ రానున్న ఎన్నికల్లో మహబూబ్‍నగర్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ పొత్తులు ఖరారైనా.. కాకపొయినా.. జడ్చర్లలో మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ జరిగే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆపద్దర్మ మంత్రి లక్ష్మారెడ్డిని ప్రకటించగా... కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లురవికి దాదాపుగా టిక్కెట్టు ఖాయమన్నట్టు తెలుస్తుంది. దీంతో జడ్చర్లలో కాంగ్రెస్, వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా కొససాగనుంది.
మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుండగా.. టికెట్ దక్కితే మల్లురవి కూడా ఇక్కడ విజయం సాధించాలనే తలంపులో ఉన్నాడు. ఒకవేళ ఓడిపోతే నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీ స్థానానికి దళిత కోటాలో మల్లురవి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. ఇక మంత్రి లక్ష్మారెడ్డికి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. ఈసారి విజయకేతనం ఎగరవేసి రెండోసారి మంత్రి పదవి చేపడుతారని లక్ష్మారెడ్డి అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తికాకపోవడం... పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న భూనిర్వాసితుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలున్నాయి. టీడిపి అభ్యర్థిగా ఎప్పుడు బరిలో ఉండే ఎర్రశేఖర్, ఈసారి మహబూబ్‍నగర్‌కు మారడంతో మల్లురవికి కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు విశ్లేషకులు. టీడీపీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలున్నాయి. ఇటీవలే పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిరుద్‌రెడ్డి కూడా జడ్చర్ల నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుండటంతో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారే అవకాశాలు లేకపోలేదు.