అభివృద్ధిలో దేశం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందన్నారు ప్రధాని మోడీ అన్నారు యావత్ దేశం విశ్వాసంతో తొణకిసలాడుతోందని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పారు. నాలుగేళ్ళ ఎన్డీఏ పాలన గురించి ఎర్రకోటపై వల్లె వేసిన మోడీ తాము రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయబోమని దేశ ప్రయోజనాలే లక్ష్యంగా తమ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు.
72వ స్వాతంత్ర్య దినోవత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలో జాతీయ జెండాను ఎగురవేశారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ప్రధాని హోదాలో ఐదవ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ గంటా 20 నిమిషాల పాటు జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆరంభంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికల గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరాం, ఉత్తరాఖండ్ గిరిజన ప్రాంతాలకు చెందిన బిడ్డలు ఎవరెస్ట్‌పై జాతీయ జెండాను ఎగరవేసి దేశ ఔనత్యాన్ని మరింత ఇనుమడింపచేశారని కొనియాడారు.
డిజిటల్ ఇండియా, స్వచ్ఛ బారత్, ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్, ఇంటింటికీ మరుగుదొడ్డి, ఆప్టికల్ ఫైబర్, జాతీయ రహదారుల విస్తరణ, పాఠశాలలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా జీఎస్టీని విజయవంతగా అమలుచేశామన్న మోడీ. వచ్చే 30 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అవినీతిని అరికట్టామనీ పౌరసరఫరాల్లో అవకతవకలను నివారించామని చెప్పారు. రికార్డు స్థాయిలో ఆహారధాన్యాలు ఉత్పత్తి చేస్తున్నామనీ అలాగే మొబైల్ ఫోన్లూ ఉత్పత్తి అవుతున్నాయనీ అన్నారు. అయితే అన్నదాతలకు న్యాయం జరగడం లేదని మోడీ అన్నారు. పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నాయనీ కానీ పెట్టుబడిలో ఒకటిన్నర రెట్లు ఆదాయం వచ్చే ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
వరుస అత్యాచార ఘటనలు కలవరానికి గురి చేస్తున్నాయని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులకు మరణ దండనే సరని మోడీ అన్నారు. ట్రిపుల్ తలాక్‌తో ఎంతో మంది ముస్లిం మహిళలకు అన్యాయం జరిగిందన్న మోడీ వారిని రక్షించేందుకు కొత్తగా బిల్లు తీసుకువచ్చామని చెప్పారు. కొన్ని కారణాల వల్ల ట్రిపుల్ తలాక్ బిల్లు తాత్కాలికంగా ఆగిపోయిందనీ త్వరలోనే ఆ బిల్లుకు మోక్షం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు విజయవంతమయ్యాయని అన్ని సామాజిక వర్గాల సమస్యలపై సుదీర్ఘ చర్చ సాగిందని మోడీ చెప్పారు. ఓబీసీ కమిషన్ బిల్లును ఆమోదించామనీ దివాళా బిల్లు, బినామీ ఆస్తుల బిల్లులతో అక్రమార్కుల భరతం పట్టేందుకు కసరత్తు ప్రారంభించామని తెలిపారు.