జీఎస్టీని గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌గా అభివర్ణించిన రాహుల్

Update: 2018-12-14 11:11 GMT


పార్లమెంట్‌లో నిద్రపోతాడు అన్న విమర్శలు ఎదుర్కొన్న రాహుల్‌, పదునైన ప్రసంగాలు చేస్తూ, మోడీకి హగ్‌లిచ్చాడు. బహిరంగ సభల్లోనూ, ఎవరో రాసింది చదువుతాడు, మోడీలా అనర్గళ ప్రసంగం చేయలేడు అన్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా, ఇప్పుడు సొంతంగానే స్పీచ్‌లు దంచేస్తున్నారు. మోడీ అంత కాకపోయినా, మాటలు తూటాల్లా పేలుస్తున్నారు.

మాటల్లో వేదాంతం, చూపుల్లో చురుకుదనమే కాదు, బీజేపీపై అనేక స్ట్రాటజీలు అప్లై చేస్తున్నారు రాహుల్. గుజరాత్‌ ఎన్నికల నుంచి ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తమకే సొంతమైనదిగా బీజేపీ భావించే హిందూత్వ అస్త్రాన్ని, లాగేసే ప్రయత్నం చేశారు. గుజరాత్‌, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, గుళ్లూ గోపురాలు తిరిగి, అందర్నీ ఆశ్చర్యపరిచారు రాహుల్. తాను శివభక్తుడినని చెప్పుకున్నారు. స్వామిజీల ఆశీర్వాదం తీసుకున్నారు. రాహుల్‌ గాంధీ టెంపుల్‌ రన్‌ స్ట్రాటజీని చూసి, బీజేపీనే అవాక్కయ్యింది. తన అస్త్రాలను లాగేసుకుంటున్నారని, మరోరకంగా దాడి చేసింది.

ఈమధ్య రాహుల్‌ ప్రసంగాలు కూడా రాటుదేలాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, రాఫెల్ స్కాం, పెట్రోల్ ధరలు, ఇలా అనేక అంశాలపై తనదైన శైలిలో, జనానికి అర్థమయ్యేలా మాట్లాడుతున్నారు. జీఎస్టీని గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌గా అభివర్ణించి, మాస్‌ జనాలకు టచ్‌ అయ్యేలా స్పీచ్‌లిస్తున్నారు. రాహుల్‌ తనలో స్పోర్ట్స్ యాంగిల్‌ కూడా బయటపెట్టుకున్నారు. కరాటేతో కుమ్మేస్తాడట..మార్షల్‌ ఆర్ట్స్‌లో ఒకటైన అకిడో తనకు వచ్చని అందులో తనకు బ్లాక్‌ బెల్ట్‌ ఉందని, ఫోటోలు కూడా రిలీజ్ చేశారు రాహుల్. 

షూటింగ్‌తో గురిచూసి లక్ష్యాన్ని బద్దలు చేస్తాడట..స్విమ్మింగ్‌లో ఇరగదీశాడట..స్కూబా డైవింగ్‌లో తనకెవరూ సాటిలేరట గతేడాది ఓ కార్యక్రమంలో, తన టాలెంట్స్‌ అన్నింటనీ, మొదటిసారి బయటపెట్టారు రాహుల్. యోగాసనాలు వేస్తూ మోడీ యోగాకు బ్రాండ్ అంబాసిడర్‌గా అవతరిస్తే, స్పోర్ట్స్‌తో యూత్‌కు దగ్గరయ్యేందుకు, తనను తాను రీబ్రాండ్‌ చేసుకునే ప్రయత్నం చేశారు రాహుల్. సూటిగా సుత్తిలేకుండా మాటలు, మోడీ బ్రాండ్ పథకాలకు కొత్త అర్థాలు, టెంపుల్‌ విజిట్స్, స్పోర్ట్స్ యాంగిల్స్, ఇప్పుడు మూడు రాష్ట్రాల ఎన్నికల విజయాలు. ఇలా తాను మారిన మనిషినని, రీలోడెడ్‌ టు పాయింట్్ ఓ వెర్షన్‌ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్.

Similar News