కోమటిరెడ్డి–సంపత్‌ కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

Update: 2018-08-15 05:27 GMT

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాల రద్దుపై హైకోర్టు సంచలనాత్మక చర్యలకు దిగింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల గన్‌మెన్లు ఎలా ఉపసంహరిస్తారంటూ తెలంగాణ డీజీపీతో పాటు రెండు జిల్లాల ఎస్పీలకు నోటీసులిచ్చింది.

ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాల రద్దుపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సంచలనాత్మకంగా స్పందించింది. ఏకంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూధనాచారికి నోటీసులు జారీ చేసింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ ల కోర్టు ధిక్కరణ పిటీషన్‌ను విచారించిన ధర్మాసనం తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. అలాగే గన్‌మెన్ల తొలగింపు విషయంలో తెలంగాణ డీజీపీ, రెండు జిల్లాల ఎస్పీలకు కూడా జవాబు చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. 

కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా అసెంబ్లీ స్పీకర్‌ మదుసూదనాచారిని ప్రతివాదిగా చేర్చుతూ కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా వారిద్దరికీ భద్రతను ఉపసంహరించడంపై కూడా తెలంగాణ డీజీపీ, నల్గొండ, గద్వాల్ ఎస్పీలకు కూడా నోటీసునలు జారీ చేసింది. 

గత బడ్జెట్ సమావేశాల్లో నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ గవర్నర్ ప్రసంగిస్తుండగా అనుచితంగా ప్రవర్తించారంటూ వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదలైంది. దీంతో వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించగా గెజిట్‌ నోటిఫికేషన్ చెల్లదని సింగిల్‌ జడ్జీ తీర్పు ఇచ్చారు. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లగా అక్కడ కూడా చుక్కెదురైంది. అయితే హైకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని కోర్టు ధిక్కరణ కింద కోమటిరెడ్డి, సంపత్‌లిద్దరూ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. 

ఈ కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలంటూ స్పీకర్‌కు షాకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ను ఎమ్మెల్యేలుగా పరిగణించాలని న్యాయస్థానం స్పష్టం చేసినా వారికి భద్రత ఉపసంహరించడంపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 28 లోగా వివరణ ఇవ్వాలని స్పీకర్‌, డీజీపీ, ఎస్పీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పును ఎవరు అమలు చేయకపోయినా శిక్షార్హులేనంటూ వ్యాఖ్యలు చేసింది. వచ్చే నెల 17 న అసెంబ్లీ, లా సెక్రటరీలు కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ఇద్దరి జీత భత్యాల చెల్లింపు వివరాలు సమర్పించాలని రిజిష్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. 

ఇదిలా ఉంటే హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు సంబంధించి తెలంగాణ సర్కార్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఈ నెల 16 న డివిజన్ బెంచ్.. ఈ కేసును విచారించనుంది. ఈ కేసు విషయమై డివిజన్ బెంచ్ ఏ రకంగా స్పందిస్తుందనేది.. ఆసక్తికరంగా మారింది. 
 

Similar News