జనాల ఆదరణ చూస్తే భావోద్వేగం. జనహోరును చూస్తే ఆపుకోలేని ఉద్వేగం. అంతులేని అభిమానంతో కట్టలు తెంచుకునే అంతరంగం. ఇంతకంటే ఏం కావాలి, ఈ ఉన్నతమైన దశలోనే నిష్క్రమించాలన్న భావావేశం. ఒక మోడీ, ఒక కేసీఆర్, ఒక వైఎస్‌ఆర్. భావోద్వేగ ప్రసంగాలతో జనాన్ని కనికట్టు చేశారు. ఇప్పుడు హరీష్‌రావు కూడా, జనాభిమానాన్ని చూసి, భావోద్వేగంతో కదిలిపోయాడు. ఇంతకీ హరీష్ రావు ఏమన్నారు? ఎందుకంత ఎమోషనల్ అయ్యారు? ఉద్వేగానికి కారణమేంటి?
ఎమోషనల్‌గా హరీష్ రావును, ఎప్పుడూ చూడలేదు కదా. మొదటిసారి చాలా భావోద్వేగంతో కదిలిపోయారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఇంతటి ప్రేమాభినాల సమయంలోనే, రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటదని, అనిపిస్తోందని అశేష ప్రజానీకాన్ని చూసి ఉద్వేగభరితమయ్యారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని, గతంలోనే దత్తత తీసుకున్నారు హరీష్ రావు. ఆ గ్రామ పంచాయితీ ప్రజలు, హరీష్ రావుకే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. హరీష్‌కు అఖండ స్వాగతం పలికారు. ఈ జనస్వాగతాన్ని చూసి, ఒక్కసారిగా కదిలిపోయారు హరీష్ రావు. రాజకీయాలపై ఒక విధమైన వేదాంత ధోరణిలో మాట్లాడారు. ఇంతటి ఆదరణ లభిస్తున్నప్పుడే, రాజకీయాల నుంచి తప్పుకుంటే, బాగుంటుందని, అనిపిస్తోందని, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవ తీర్మానం, ఒక అద్భుతమని వర్ణించారు.
గతంలో ఎన్నికల సందర్భంలోనే, చాలామంది నేతలు భావోద్వేగంగా మాట్లాడారు. ఇలాంటి ఎమోషనల్ స్పీచుల్లో నరేంద్ర మోడీ దిట్ట. తనను చంపడానికి
పాకిస్తాన్‌లో కుట్ర చేస్తున్నారని, గుజరాత్ అసెంబ్లీ పోరులో వ్యాఖ్యానించి, సెంటిమెంట్‌ను రగిలించారు. ఇక కేసీఆర్ సైతం భావోద్వేగాలను రగిలించడంలో దిట్ట. తెలంగాణ ఉద్యమాన్ని ఉద్వేగ ప్రసంగాల వేడితోనే, కొనసాగించారు. ఇవే తనకు చివరి ఎన్నికలని 2004 ఎన్నికల్లో దివంగత రాజశేఖర్ రెడ్డి అన్నారు. అలాగే మొన్న జరిగిన కర్ణాటక పోరులోనూ, సిద్దరామయ్య ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అంటే, ఎన్నికల సందర్భంలో భావోద్వేగాన్ని రగిలించే ప్రయత్నం చేసి, జనాల మనసును దోచే ప్రయత్నం చేస్తుంటారు రాజకీయ నాయకులు. కొందరు దీన్నొక అస్త్రంగా ప్రయోగిస్తే, మరికొందరు యథాలాపంగా, ఆ జనహోరు, ఆదరణను చూసి, బరువెక్కిన హృదయంతో, అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు.