క్రమ శిక్షణకు మారుపేరు ఆ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అత్యున్నత పదవి చేపట్టి మెప్పించ్చిన సీనియర్ నేత. లోకల్ నియోజకవర్గాన్ని కాదని వెళ్లిన ఆయనకు గడ్డు పరిస్ధితి ఎదురైంది. నాన్ లోకల్ స్ధానంలో అదృష్టం పరీక్షించుకున్న సదరు నేతకు రెండు సార్లు చుక్కెదురైంది. దీంతో ఆయన రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. ఇడా ఉంటా ఆడా ఉంటా అంటూ రెండు నియోజకవర్గాలపై కన్నేసిన ఆయనకు లోకల్ నియోజకవర్గ నేతల నుంచి ముప్పు ఎదురవుతోంది. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆ నేత ఎవరు? గురి పెట్టిన నియోజకవర్గం ఏది?
చట్ట సభకి అధిపతి ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 283 మంది సభ్యులను నియంత్రించిన వ్యక్తి ఆయనే మాజీ సభాపతి సురేష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన ఆయన ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆయన అదే నియోజకవర్గం నుంచి 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో స్పీకర్ గా పనిచేసి మిస్టర్ ఫర్ ఫెక్ట్ అనిపించుకున్నారు. 2009 ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గాన్ని వదిలి ఆర్మూర్ నియోజకవర్గానికి షిప్ట్ అయ్యారు. అంతే అప్పటి వరకూ కొనసాగిన ఆయన జైత్రయాత్ర అక్కడితో పుల్ స్టాప్ పడింది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఓడిపోయారు. అప్పటి నుంచి ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక నేతగా ఉంటూ జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలపై కన్నేసిన ఆయన రెండు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఫలితంగా కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
నాలుగు సార్లు గెలిచిన బాల్కొండ సేఫ్ జోన్ గా ఉంటుందా..? రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి వర్కవుట్ అవుతుందా ? అన్న సమీకరణాలను మాజీ స్పీకర్ తేల్చుకోలేకపోతున్నారు. సురేష్ రెడ్డి ఆర్మూర్ కు మారగానే బాల్కొండ నియోజకవర్గంలో మాజీ విప్ ఈ. అనిల్ జెండా పాతారు. నియోజకవర్గ ఇంచార్జీగా కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జీగా ఉన్న సురేష్ రెడ్డి అక్కడ ఉంటూనే బాల్కొండ నియోజకవర్గంలోని తన అనుచరులకు పదవులు ఇప్పించుకోవడం, సొంత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడంతో బాల్కొండ నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సురేష్ రెడ్డి ఆర్మూర్ లో కాకుండా బాల్కొండపై ఫోకస్ పెట్టడంతో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ అనిల్ గుర్రుగా ఉన్నారు. తన నియోజకవర్గంలో ఆయన పెత్తనం పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇటు అనిల్ వర్గం అటు సురేష్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. సురేష్ రెడ్డి బాల్కొండకు షిప్ట్ అయితే.. అనిల్ పరిస్ధితి ఏంటన్నది ప్రశ్నార్ధకంలా మారింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మరో నేత రాజారాం యాదవ్ సైతం బాల్కొండ టికెట్టు ఆశిస్తుండటం కొసమెరుపు.
ఆర్మూర్ నుంచి బాల్కొండకు సురేష్ రెడ్డి షిప్ట్ అవుతారనే సమాచారంతో ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆర్మూర్ పై కన్నేసింది. మరో సీనియర్ నాయకురాలు తన వారసుని బాల్కొండ లేదా ఆర్మూర్ ఈరెంటిలో ఏదో ఒక నియోజక వర్గం నుంచి టిక్కెట్టు ఇప్పించుకోవాలనే పట్టుదలలో ఉన్నారు. టిక్కెట్టు రేసులో ఉన్న నేతలు సీటు నాదా నీదా అంటూ బల ప్రదర్శనలు చేస్తున్నారు. ఇప్పుడు ఈరెండు నియోజక వర్గాల రాజకీయాలు మాజీ స్పీకర్ ఎంచుకునే సీటుపైనే ఆధారపడి ఉన్నాయి.