నిన్నమొన్నటివరకూ కత్తులు దూశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని మాటల తూటాలు పేల్చారు. అనేక లేఖలతో ప్రభుత్వం యుద్ధం ప్రకటించారు. చంద్రబాబు టార్గెట్‌గా ఎన్నోసార్లు విరుచుకుపడ్డారు. అలాంటి ఉండవల్లి అరుణ్‌కుమార్ సడన్‌గా చంద్రబాబును ఎందుకు కలిశారు?. ఎప్పుడూ చంద్రబాబుపై విరుచుకుపడుతూ జగన్‌కు సపోర్ట్ మాట్లాడే ఉండవల్లి అమరావతి టూర్ వెనుక కారణమేంటి?
విభజన హామీల అమలు, పార్లమెంట్‌లో పోరాటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసిన ఉండవల్లి అరుణ్‌కుమార్ అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు గంటకు పైగా జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగింది.
రాజ్యాంగ విరుద్ధంగా, లోక్‌సభ తలుపులు మూసి విభజన బిల్లును ఆమోదించారన్న ఉండవల్లి తాను గతంలో రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలు, కోర్టుల్లో వేసిన పిటిషన్ల కాపీలను, ఇతర ఆధారాలను చంద్రబాబుకి అందజేశారు. పార్లమెంట్ తలుపులు మూసి విభజన బిల్లును ఆమోదించారన్న మోడీ వ్యాఖ్యలపైనా, చట్టవిరుద్ధంగా జరిగిన విభజనపైనా స్వల్ప కాలిక చర్చకు నోటీసులు ఇవ్వాలని సీఎంకి సూచించినట్లు తెలిపారు. ముఖ్యంగా విభజన హామీల అమలు కోసం పార్లమెంట్‌లో ఎలా పోరాడాలో సలహాలిచ్చానన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ ఎంపీలు ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్సేతర రాజకీయపక్షాలను కలుస్తూ మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి మద్దతివ్వాలంటూ కోరుతున్నారు. మొత్తానికి బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న టీడీపీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓ రేంజ్‌లో పోరాటానికి సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది.