మనం ఏదైనా వస్తువు కొనేందుకు డబ్బులు మన కరెన్సీలో డబ్బులు చెల్లిస్తాం. అమెరికాలో అయితే డాలరు. యూరోప్‌లో యూరో. ఇలా ఏ దేశం వారు ఆ దేశం కరెన్సీలో లావాదేవీలు సాగిస్తుంటారు. ఆన్‌లైన్‌లోనూ డెబిట్, క్రెడిట్ కార్డును ఉపయోగించి షాపింగ్ చేస్తాం. అంతేకాదు మన అకౌంట్‌లోని డబ్బులను ఇతరులకు ట్రాన్స్ ఫర్ చేస్తాం. ఇవన్నీ చలామణిలో ఉన్నవే. కానీ ప్రపంచంలో సరికొత్త మారకం ఎప్పుడో తెరపైకి వచ్చింది. ఇప్పుడిప్పుడే తన ఉనికిని విస్తృతం చేసుకుంటోంది. అదే బిట్ కాయిన్.
బిట్‌కాయిన్.. ఈ పదం వింటే చాలు అనేక ప్రశ్నలు. ఎందుకీ బిట్ కాయిన్ అని ప్రశ్నించేవారికన్నా... అసలు ఏంటీ బిట్ కాయిన్ అని ప్రశ్నించేవారే ఎక్కువ. సింపుల్‌గా ఇదో ఆన్‌లైన్ కరెన్సీ! డిజిటల్ కరెన్సీ.
ప్రతి దేశానికీ ఓ కరెన్సీ ఉంది. అంతర్జాతీయంగా దాదాపు అందరూ ఆమోదించే అమెరికన్ డాలర్ ఎటూ ఉంది. ఒకవేళ ఆన్‌లైన్లో కొనాలంటే వీసా, మాస్టర్ కార్డులు ఉండనే ఉన్నాయి. మరి ఈ బిట్ కాయిన్ ఎందుకు? ఏంటీ బిట్‌కాయిన్? ఎలా పుట్టింది? దీన్ని మేనేజ్ చేసేదెవరు? తయారు చేసేదెవరు? దీన్ని మనం సంపాదించటమెలా? అసలిప్పుడు దీని విలువెంత? దీంతో ఏది పడితే అది కొనుక్కోవచ్చా? అందరూ వీటిని అంగీకరిస్తారా? బిట్ కాయిన్లు మన దగ్గరుంటే మార్చుకోవచ్చా? అమ్మో!! ఎన్ని సందేహాలో..
ఈ సందేహాల చిట్టా అంతు లేకుండా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే... ఇది డబ్బు బాబూ... డబ్బు. ఎలాంటి నియంత్రణలూ లేకుండా ఎవరికి వాళ్లు తమకి కావాల్సిన సొమ్మును, ఎప్పుడంటే అప్పుడు, భారీ చార్జీలు లేకుండా డిజిటల్ రూపంలో పంపించుకోగలిగితే...
ఈ ఊహ నుంచి పుట్టిందే బిట్‌కాయిన్ వ్యవస్థ. ఇది ఏ దేశానికీ చెందదు. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రాదు. అచ్చమైన అంతర్జాతీయ కరెన్సీ. దీని సృష్టికర్త ఎవరికీ తెలీదు. కానీ సతోషి నకమోటో అనే జపానీస్ మారుపేరుతో బిట్‌కాయిన్ల గురించి 2008లో ఒక కథనం ప్రచురితమైంది. తర్వాత ఏడాదికి... అంటే 2009 జనవరి 3న ఈ వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది.
ఎలక్ట్రానిక్ లావాదేవీలకు బిట్‌కాయిన్లు వాడొచ్చు. బిట్‌కాయిన్లతో ఏది కొన్నా... ఆ లావాదేవీ తక్షణం డిజిటల్ రూపంలో లాగ్ అవుతుంది. ఈ ‘లాగ్’లో ఎప్పుడు కొన్నారు? లావాదేవీ జరిగాక ఎవరి దగ్గర ఎన్ని కాయిన్లున్నాయి? వంటివన్నీ అప్‌డేట్ అయిపోతాయి.
బంగారం మాదిరిగా బిట్‌కాయిన్లూ అరుదైనవే. వీటిని సూపర్ కంప్యూటర్ల ద్వారా... అది కూడా పరిమితంగానే సృష్టించగలరు. అందుకే బిట్‌కాయిన్ల ట్రేడింగ్‌లో స్పెక్యులేషన్ పెరిగింది. వర్డ్‌ప్రెస్, ఓవర్‌స్టాక్.కామ్, రెడ్డిట్, ఓకే క్యుపిడ్, వర్జిన్ గెలాక్టిక్, బైదు లాంటి సంస్థలన్నీ ఆన్‌లైన్ షాపింగ్‌కు బిట్‌కాయిన్లను అనుమతిస్తున్నాయి.