తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది. ఆశించిన స్థాయిలో పథకం అమలు కావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూసేకరణ లో అధికారుల అలసత్వం పథకాన్ని నీరుగారుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ పథకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ పథకం ప్రవేశపెట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు 12 వేల 173 ఎకరాల భూమిని పంపిణి చేశారు. 4 వేల 717 మంది లబ్దిదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరింది. మొత్తం రాష్ర్ట వ్యాప్తంగా 14 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 2.50 లక్షల కుటుంబాలు భూమి లేని వారున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచేందుకు దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చూట్టింది. 2014 ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. భూ పంపిణీ పథకానికి ప్రభుత్వం ఎకరాకు సగటున నాలుగు లక్షల 22 వేలు ఖర్చు చేస్తోంది. వాస్తవానికి ఈ పథకం ఎంతో గొప్పదని అంతా భావించారు. కాని ఆచరణలో అమలు చేయడానికి అధికారులకు కత్తిమీద సాములా మారింది. భూసేకరణ చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంపై తాము పెట్టుకున్న ఆశలన్నీ అడి ఆశలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూమి ఆశిస్తున్న లబ్దిదారులు.
ప్రభుత్వం చెబుతున్న మాటల్లో ఎంత మాత్రం నిజం లేదని కేవలం అధికారంలోకి వచ్చేందుకే ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి నేటికి ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. ఈ పథకంపై అపోహ చెందాల్సిన పని లేదంటున్నారు ఎస్సీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనైనా తెలంగాణ ప్రభుత్వం భూ పంపిణీ చేస్తుందని ఆశిస్తున్నారు పలువురు లబ్దిదారులు.