కేంద్రంలో బీజేపీ సర్కారుకు కౌంట్ డౌన్ మొదలైందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికలు, పొత్తులు, ప్రచార కమిటీ బాధ్యతలను రాహుల్‌కే అప్పగించిన వర్కింగ్ కమిటీ ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా కూలంకషంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాక తొలిసారిగా నిర్వహించిన వర్కింగ్ కమిటీ సమావేశం ఉత్సాహంగా సాగింది. 23 మంది సభ్యులతో కూడిన కమిటీ వచ్చే సాధారణ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఈ యేడాది చివర్లో జరగనున్న మూడు రాష్ట్రాల ఎన్నికలపై కూడా కూలంకశంగా చర్చ జరిపారు. రాష్ట్రాలు, సాధారణ ఎన్నికల ఎజెండా, అనుసరించాల్సిన వ్యూహాలను ఈ భేటీలో ఖరారు చేశారు.
ముఖ్యంగా కేంద్రంలోని మోడీ సర్కారును ఎదుర్కొనేందుకు రాహుల్ నాయకత్వంలో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. దీంతోపాటే ఎన్నికల్లో పొత్తులపై కూడా చర్చ జరిగింది. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు పొత్తు నిర్ణయాలన్నీ రాహుల్‌కే అప్పగించారు. అలాగే ఎన్నికల ప్రచార కమిటీ నియామక బాధ్యతను రాహుల్‌కు అప్పజెప్పారు.
వేదనలో ఉన్న దేశాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నామని ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని రాహుల్ స్పష్టం చేశారు. బీజేపీకి కౌంట్‌డౌన్ మొదలైందని దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని రాహుల్ స్పష్టం చేశారు. అయితే పార్టీ బలోపేతంతో పాటు పొత్తులపైనే ప్రధాన చర్చ జరిగినట్లు ఆ పార్టీ అగ్రనేత వీరప్ప మొయిలీ తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. మేనిఫెస్టోలో ప్రధాన అంశాలను ఇప్పటి నుంచే ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుందని తెలిపినట్లు వివరించారు. బీజేపీ నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు అందరూ కష్టపడాలని వివరించారు. రాహుల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ వంటి అగ్రనేతలతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన పీసీసీ చీఫ్‌లు హాజరయ్యారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.