‘ఫెడరల్ ఫ్రంట్’ వెనుక కేసీఆర్ వ్యూహాలేమిటి.. ఇది మోదీని పడగొట్టడానికా.. మరింత బలపర్చడానికా?
తెలంగాణలో అఖండ విజయం సాధించిన తర్వాత, మరోసారి ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన చేశారు సీఎం కేసీఆర్. దేశానికి కొత్త మోడల్ ఆర్థిక వ్యవస్థ కావాలి వ్యవసాయ, ఆర్థికరంగాల్లో విప్లవం రావాలి. దేశంలో రాజకీయవ్యవస్థకు శస్త్రచికిత్స చేయాలని స్పష్టం చేశారు. ఇవన్నీ సాకారం కావాలంటే కాంగ్రెసేతర, బీజేపీయేత పాలన దేశానికి కావాలన్నారు. దేశ ప్రజల కోసమే ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో త్వరలోనే నేషనల్ పార్టీ పెడతానని ప్రకటించారు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్‌లోనూ పర్యటిస్తానని చెప్పారు.
కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా రాష్ర్టానికో విధానం ఉందన్నారు కేసీఆర్. రాష్ట్ర గ్రామీణ, పట్టణాభివృద్ధి, ఆరోగ్య శాఖలు కేంద్రానికి ఎందుకని ప్రశ్నించిన కేసీఆర్... రైతుబంధును దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం ఫెడరల్ ఫ్రంట్ వేదికగా ప్రత్యేక చొరవ తీసుకుంటానని ప్రకటించారు. దేశం మొత్తం రైతుబంధు అమలు చేస్తే మూడున్నర లక్షల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందన్నారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనపై జాతీయస్థాయిలో హాట్‌హాట్‌గా చర్చ సాగుతోంది. దాదాపు ఏడాదిన్నర నుంచి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్. టీఎంసీ అధినేత మమత, డీఎంకే స్టాలిన్, జేడీఎస్ దేవేగౌడ, ఎస్పీ అఖిలేష్ యాదవ్‌లను సైతం కలిశారు. అయితే ఇప్పడు వీరిలో ఎస్పీ, బీఎస్పీ తప్ప మిగిలిన పార్టీ నేతలంతా, మొన్న ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కూటమి సమావేశానికి సైతం హాజరయ్యారు. మరి కేసీఆర్‌తో వచ్చే పార్టీలేవీ అన్నది అర్థంకావడం లేదు. అయితే ఒక్కటి మాత్రం నిజం, తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో అత్యధికం గెలిచి, 2019లో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడమో, లేదంటే బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఏకం చేయడమో చేయాలని కేసీఆర్ స్ట్రాంగ్‌గా డిసైడయ్యారు. చూడాలి, అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీయే, మరోవైపు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలిస్తాయో, ఏ పార్టీ ఎటు వైపు ఉంటుందో.