కీలక కాంగ్రెస్‌ నాయకులపై గులాబీ అభ్యర్థులు

Update: 2018-09-07 04:21 GMT

తెలంగాణ రాజకీయాల్లో ఉద్దండ విపక్ష నాయకులపై, గులాబీదళాధిపతి పోటీగా ఎవరిని నిలబెట్టారు...కీలక నేతలను ఓడించడానికి బరిలోకి దింపిన అభ్యర్థులెవరు?

నాగార్జున సాగర్. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటి. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానమిది. కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం అవుదామనుకుంటున్నారు జానారెడ్డి. అలాంటి కీలక స్థానమైన నాగార్జున సాగర్‌లో, జానాకు ప్రత్యర్థిగా నోముల నర్సింహయ్యను నిలబెట్టారు కేసీఆర్. గతంలోనూ జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు నోముల. అయితే  ఈసారి విజయం సాధిస్తానంటున్నారు. కమ్యూనిస్టు పార్టీ బ్యాగ్రౌండ్‌ ఉన్న నోములను నిలబెడితే, జానాకు గట్టిపోటీ తప్పదన్న లెక్కల్లో ఉన్నారు కేసీఆర్.

రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రధానమైన నియోజక వర్గాల్లో కొడంగల్ ఒకటి. కాంగ్రెస్ కీలక నేత, ఫైర్‌ బ్రాండ్ రేవంత్ రెడ్డికి ప్రాతినిధ్యం నియోజకవర్గం ఇది. ఇక్కడ రేవంత్‌ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాటజీలు వేస్తోంది. రేవంత్‌కు పోటీగా ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డిని ప్రకటించి, పోరును రసవత్తరంగా మలిచారు కేసీఆర్. నరేందర్ రెడ్డి, మంత్రి మహేందర్‌ రెడ్డికి స్వయానా తమ్ముడు.

మథిర. కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క సిట్టింగ్ స్థానం. వరుసగా ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచి, నియోజకవర్గంలో తిరుగులేని పట్టు సాధించారు. భట్టి విక్రమార్కపై టీఆర్ఎస్‌ తరపున కమల్‌రాజ్‌‌ను పోటీకి నిలిపారు కేసీఆర్. 2014లో తొలిసారి సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా నిలబడి, ఇదే స్థానంలో భట్టి చేతుల్లో ఓడిపోయారు కమల్‌రాజ్. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి అనుచరుడిగా కమల్‌ రాజ్‌కు పేరుంది. పొంగులేటితో పాటు గులాబీ కండువా కప్పుకున్నారు. రెండోసారి తలపడుతున్న వీరిమధ్య పోటీ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

గద్వాల సంస్థానం మహారాణిగా, వరుసగా విజయాలు సాధిస్తోంది డి.కె. అరుణ. అయితే తన మేనల్లుడి నుంచే గట్టి పోటీ ఎదుర్కోబోతోంది. గద్వాల నియోజకవర్గం నుంచి మరోసారి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని బరిలోకి దింపారు కేసీఆర్. వరుసకు బంధువులైనా నియోజకవర్గంలో వీరికి బద్దవైరం నడుస్తోంది. 2014లోనే డికే అరుణకు టఫ్‌ ఫైట్‌ ఇచ్చారు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. డీకే అరుణను ఎదుర్కొనే సత్తా కేవలం బండ్లకే ఉందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో ఈసారి గద్వాల సంస్థానం కోసం గట్టి యుద్ధం తప్పదన్న చర్చ మొదలైంది. మొత్తానికి 105 మంది అభ‌్యర్థుల పేర్లు ప్రకటించి యుద్ధానికి సిద్దమని ప్రకటించిన కేసీఆర్, తెలంగాణలో కీలక విపక్ష నేతలైన జానా, రేవంత్, భట్టి, డికే అరుణలపై గులాబీదళం నుంచి ఇంతకముందు నిలబెట్టిన అభ్యర్థులనే బరిలోకి దింపారు.

Similar News