ఎంతో ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్ని అంచనాలను తలకిందులు చేశాయి. కన్నడసీమలో హంగ్ వస్తుందన్న ఎగ్జిట్ ఫోల్స్ తారుమారయ్యాయి. మరోసారి అధికార పీఠం తమదేనని భావించిన సీఎం సిద్దరామయ్యకు అక్కడ ప్రజలు ఊహించని షాక్‌ను ఇచ్చారు. పోల్ పండిట్ల అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ అత్యధిక సీట్లను గెల్చుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. హస్తం పార్టీకి చేయి కాలడం వెనుక అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి పలు కారణాలున్నట్టు చెబుతున్నారు. లింగాయత్‌లకు మైనారిటీ హోదా ఇవ్వడంతో పాటు, వారికి పలు ప్రజాకర్షక పథకాలు ప్రకటించి వారి ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య పన్నిన వ్యూహం దారుణంగా బెడిసికొట్టింది. ఈ మేరకు తుది ఆమోదం కోసం కేంద్రానికి తీర్మానాన్ని పంపింది. అయితే ఈ నిర్ణయం కాంగ్రెస్‌కు అనుకూలించలేదు. వీరశైవులు, ఇతర హిందూ వర్గీయులు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. లింగాయత్‌లు సిద్దరామయ్య ప్రభుత్వ నిర్ణయంపై సంతోషంగా ఉన్నప్పటికీ తమ వర్గీయుడైన యెడ్యూరప్ప వెన్నంటి నిలిచారు.
బీజేపీ పకడ్బందీగా అమలు చేసిన వ్యూహాన్నిపసిగట్టి ధీటుగా స్పందించడంలో కాంగ్రెస్ వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి మోడీ, అమిత్ షా పకడ్బందీగా నియోజకవర్గాల స్థాయి నుంచి వ్యూహాలు రచించి వాటి అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టి ముందుకు సాగారు. బీజేపీ తరఫున ప్రధాని మోడీ, అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి స్టార్ క్యాంపెయినర్లు విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పూర్తిగా సిద్దరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనే ఆధారపడింది. ముగింపు దశలో సోనియాగాంధీ వచ్చినప్పటికీ అప్పటికే చాలా ఆలస్యమైంది.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మోడీ లక్ష్యంగా వాగ్బాణాలు సంధిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. సిద్దరామయ్య ట్విట్టర్‌లో మోడీ, కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పపై, గాలి జనార్దన్ రెడ్డి అనుచర వర్గంపై అవినీతి ఆరోపణలతో టార్గెట్ చేస్తూ విస్తృతం ప్రచారం నిర్వహించినా ఆశించిన ఫలితాలను రాబట్టలేక పోయారు. కన్నడ ప్రచారంలో రాహుల్ గాంధీలో గతకంటే కొంత ఉత్సాహాన్ని నింపగలిగినా ఓటింగ్‌కు వచ్చే సరికి కన్నడ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు.
బీజేపీ విజయంలో బీఎస్ యెడ్యూరప్ప, శ్రీరాములు ఇద్దరూ కీలకపాత్ర పోషించారు. 2012లో బీజేపీ నుంచి బయటకొచ్చిన యెడ్యూరప్ప, శ్రీరాములు సొంత పార్టీలు పెట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టారు. యెడ్యూరప్ప పార్టీ కర్ణాటక జనతా పక్ష 9.8 శాతం ఓటింగ్‌తో 6 సీట్లు, శ్రీరాములు పార్టీ బదగర శ్రామిక రైతల కాంగ్రెస్ 2.7 శాతం ఓట్లతో నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. దీంతో బీజేపీ 20 శాతం ఓటింగ్‌తో కేవలం 40 సీట్లు మాత్రమే గెలుచుకుంది. యెడ్యూరప్ప, శ్రీరాములు దెబ్బకి బీజేపీకి లింగాయత్, గిరిజన తెగల ఓట్లు దూరం అయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఆ ఇద్దరు నేతలే బీజేపీ ఓటు షేర్ పెరిగేందుకు సాయపడ్డారు. ముఖ్యంగా తమ సామాజిక వర్గాల ఓట్లతోపాటు, తమ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉత్తర కర్ణాటకలో బీజేపీ అత్యధిక సీట్లు దోహదపడ్డారు.
సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక ప్రాంతాల్లో, ముంబై-కర్ణాటక, హైదరాబాద్- కర్ణాటక, బెంగళూరు నగరంలోనూ బీజేపీ మంచి విజయం సాధించింది. ఎంతోకాలంగా కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్న ముస్లిం వర్గం కూడా ఈసారి బీజేపీకి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న తీర ప్రాంతంలో బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అంతేగాకుండా కావేరీ నదీ జలాల వివాదాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం జాప్యం చేయడం కర్ణాటకలో ఆ పార్టీకి లాభించిందని పలువురు నాయకులు భావిస్తున్నారు. మరోవైపు మరాఠాల ప్రభావం ఓటర్లపై అధికంగా ఉండటం కూడా బీజేపీ విజయానికి ఓ కారణమని అంటున్నారు.