ఒకే ఒక్క చాన్స్‌ ఇవ్వండి...

Update: 2018-10-29 11:50 GMT

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఒకే ఒక్క ఛాన్స్.. అభ్యర్ధిగా ఖరారు చేస్తే చాలు.. ఎమ్మెల్యే సీటు పార్టీకి కానుకగా ఇస్తాం.. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతాం.. అన్ని ఖర్చులు మేమే భరిస్తాం అంటూ ఆ ఎమ్మెల్సీలు... ఎమ్మెల్యే సీటు కోసం పట్టుబడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకే జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు అదే బాటలో ఉన్నారు. ఓ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖరారు కాగా.. మరో ఇద్దరి పోటీపై అనిశ్చితి నెలకొంది. ఎమ్మెల్సీల పదవీ కాలం మరో మూడేళ్ల వరకు ఉండటంతో.. టికెట్టు కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే సీటుపై కన్నేసిన ఎమ్మెల్సీలు పై ప్రత్యేక కథనం. 

నిజామాబాద్ జిల్లాలో ముందస్తు ఎన్నికల పోరు రసతవత్తరంగా కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్ 9 మంది సిట్టింగ్ అభ్యర్ధులను ఖరారు చేయగా.. ప్రజా కూటమిలో ఇద్దరు అభ్యర్ధులు దాదాపుగా ఖరారయ్యారు. మరో ఏడు స్ధానాలపై పీటముడి నెలకొంది. కాంగ్రెస్ నుంచి టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్ధులు టికెట్టు కోసం ఢిల్లీ స్ధాయిలో ఫైరవీలు చేస్తున్నారు. ఆశావాహుల రేసులో కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు ఒక్క ఛాన్స్ ఇవ్వడంటూ పట్టుబడుతున్నారు. 

శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీకి కామారెడ్డిలో పోటీ లేకపోవడంతో.. ఆయన అభ్యర్ధిత్వం ఖరారైంది. ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం ఏడాది లోపు ఉంది. తొలి జాబితాలో ఆయన పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ అధినేత రాహుల్ గాంధీ  కామారెడ్డి బహిరంగ సభలో  షబ్బీర్ ను గెలిపించాలంటూ కోరడం ఆయన బెర్త్ కు ఢోకా లేదన్నది స్పష్టమైంది.  

ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఆకుల లలిత కాంగ్రెస్ టికెట్టు ఆశిస్తున్నారు. రేసులో సైతం ఆమె మొదటి వరుసలో ఉన్నారు. ఐతే ఎమ్మెల్సీ పదవీ కాలం మరో మూడేళ్లు మిగిలిఉండటం ఆర్మూర్ నుంచి మరో ముగ్గురు నేతలు టికెట్టు కోసం పట్టుబడుతుండటంతో అభ్యర్ధిత్వం ఖరారుపై సస్పెన్స్ నెలకొంది. ఐతే ఆకుల లలిత మాత్రం టికెట్టు ఇస్తే ఎమ్మెల్యే సీటును పార్టీకి బహుమతిగా ఇస్తానంటోంది. టికెట్టు తనకు ఖరారైందంటూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. బీసీ కార్డు, మహిళా కోటాలో తనకు టికెట్టు దాదాపు ఖరారవుతుందని ఆకుల లలిత ధీమాగా ఉన్నారు. టికెట్టు ఆశిస్తున్న రేవంత్ వర్గం నేత రాజారాం యాదవ్, మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు తమకే టికెట్టు వస్తుందనే ధీమాలో ఉన్నారు. దీంతో ఆకుల లలిత అభ్యర్ధిత్వంపై సస్పెన్షన్ నెలకొంది. 

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీకి రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన కారు దిగి  హస్తం గూటికి చేరారు. ఎమ్మెల్సీ భూపతి రెడ్డికి మరో రెండేళ్ల పదవీ కాలం ఉంది. ఐతే రూరల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డిని ఓడించే సత్తా తనకు ఉందంటున్నారు భూపతిరెడ్డి. ఐతే రూరల్ నియోజకవర్గం రేసులో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ముందు వరుసలో ఉండటం భూపతిరెడ్డికి టికెట్టు దక్కడం అంత ఈజీ కాదన్నది కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయం.

కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే సీటుపై కన్నేసి.. టికెట్టు కోసం ఢిల్లీ స్ధాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. గెలిస్తే ఎమ్మెల్యే లేకుంటే ఎమ్మెల్సీగా పదవీ కాలం ఉండటంతో.. ఎలాగైనా సేఫ్ జోన్ లో ఉన్నామనే ధీమా ఎమ్మెల్సీల్లో ఉంది. ఒక కుటుంబంలో ఒకే టికెట్టు అంటున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. ఒక అభ్యర్ధి ఒకే పదవి అంటే ఆ ఎమ్మెల్సీల ఆశలు అడియాసలు అయ్యే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యే అభ్యర్దులుగా అవకాశం ఇస్తారా.. ? లేదా అన్నది తేలాల్సి ఉంది.  

Similar News