ఆ మూడు ఆయుధాలేంటి? కాంగ్రెస్‌ బలమేంటి?

Update: 2018-11-30 05:37 GMT

 

తెలంగాణలో గుజరాత్‌ ఫార్ములా అప్లై చేయాలనుకుంది కాంగ్రెస్. ఇప్పటికే ఆచరణలో పెట్టింది. ప్రభావం చూపిస్తోందని లెక్కలేస్తోంది. గుజరాత్ సూత్రం పక్కాగా వర్కౌట్‌ అవుతుందని ధీమాగా ఉంది. ఇంతకీ గుజరాత్‌ ఫార్ములా ఏంటి...తెలంగాణలో కాంగ్రెస్‌ అప్లై చేయడమేంటి? పక్కా స్కెస్‌తో ఎన్నిక‌ల‌ రణరంగంలో కత్తులు దూస్తోంది తెలంగాణ కాంగ్రెస్. అందివచ్చిన ఏ అవ‌కాశాన్నీ వ‌దిలిపెట్టడం లేదు. కలిసివవ్చే అన్ని దారుల్ని త‌మ‌వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అధికార టీఆర్ఎస్‌ను ఎదర్కునేందుకు శాయ‌శ‌క్తులూ ఒడ్డుతోంది. అందుకోసం మూడు ఆయుధాల‌ను సిద్దం చేస్తున్నామంటుంన్నారు కాంగ్రెస్ సీనియ‌ర్లు. 

ఇప్పటికే కూట‌మి కట్టి త‌న బ‌లానికి మ‌రింత బ‌లగం చేర్చుకుంది కాంగ్రెస్. అయినా గులాబీదళాన్ని ఎదుర్కోవడంలో ఎక్కడో అనుమానం. త‌మ బ‌లం స‌రిపోతుందా అని సందేహం. అందుకే మ‌రో మూడు ఆయుధాల‌కు పదునుపెట్టింది. గుజరాత్ ఎన్నిక‌ల్లో అక్కడి కాంగ్రెస్ అనుసరించిన ఫార్ములానే, ఆ అస్త్రం. అల్షేష్ ఠాకూర్, జిఘ్నేష్‌ మేవాని, హార్ధిక్‌ పటేళ్ల మద్దతు కూడగట్టి, గుజరాత్‌ సోషల్‌ ఇంజినీరింగ్‌లో సక్సెస్ అయ్యింది. ఈ ఫార్ములాతో గుజ‌రాత్‌లో కాంగ్రెస్ గెల‌వ‌కపోయినా బీజేపీని ముచ్చెమటలు పట్టించింది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ఈ ఫార్ములాపై దృష్టి పెట్టింది. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలతో కూటమిని ఏర్పాటు చేస్తూనే, ఉద్యమ సంఘాలు, సామాజిక ఉద్యమకారులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో, వ్యూహాత్మకంగా విజయం సాధించామని భావిస్తోంది కాంగ్రెస్. సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్, అన్ని వర్గాల మద్దతు కూడగట్టింది. ప్రజాగాయకుడు గద్దర్, ఎమ్మార్పీఎస్‌ అధినేత మందకృష్ణ, బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను ఒక్కటి చేయడంలో సక్సెస్‌ అయ్యింది. ఆర్‌.కృష్ణయ్య మిర్యాలగూడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, కాసాని జ్ణానేశ్వర్‌ సికింద్రాబాద్‌ బరిలో ఉన్నారు. గద్దర్‌ ఎక్కడా పోటీ చేయకపోయినా, ఆటపాటతో ప్రజాకూటమి సభల్లో ధూంధాం చేస్తున్నారు.

ఇలా బీసీ, ఎస్సీల్లో కీలకమైన నాయకులను ఒకేవేదిక తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యానని భావిస్తోంది కాంగ్రెస్. ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించిన నేతలందరినీ ఒకే వేదికపై కూర్చోపెట్టి  టీఆర్ఎస్‌పై వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగుతోంది. మేడ్చల్‌ సోనియా గాంధీ సభలో, వీరందర్నీ ఒకే వేదికపై కూర్చోబెట్టి, సామాజిక సమీకరణాలు పక్కాగా ఉన్నాయని లెక్కలేస్తోంది. గుజరాత్‌ ఫార్ములాపై గట్టి నమ్మకం పెట్టుకుంది కాంగ్రెస్. జనాభా పరంగా అత్యధిక సంఖ్యలో ఉండే, ఎస్సీలు, బీసీలకు చెందిన కీలక నాయకులను, తమవైపు తిప్పుకోవడం ద్వారా, ఆయా వర్గాలందరూ తమవైపే ఉంటారన్న ధీమాతో ఉంది. గుజరాత్ కాంగ్రెస్ ఫార్ములా, తెలంగాణ కాంగ్రెస్‌‌కు వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి.

Similar News