ముందస్తుకు ఉత్తమ్ రంకెలు వేయడం వెనుక సొంత అజెండా ఉందా..?

Update: 2018-06-27 05:40 GMT

కేసీఆర్ ముందస్తు ఎన్నికల సవాల్‌కు ఉత్తమ్ సై అనడం హాట్ టాపిక్‌గా మారింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు సరే...ముంద‌స్తు ఎన్నిక‌లకు హ‌స్తం పార్టీ నిజంగానే సిద్ధంగా ఉందా అనే అనుమాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నారు. అసలు ఉత్తమ్ ఎందుకు ముందస్తుకు మొగ్గు చూపారనే చర్చ జోరుగా సాగుతోంది..? 

కేసీఆర్ ముందస్తు రాగం సవాలా..? వ్యూహ‌మా..సీఎం స‌వాల్‌కు ఉత్త‌మ్ సై అనటంలో ఆంత‌ర్య‌మేంటి..?

సీఎం కేసీఆర్ విసిరిన ముందస్తు సవాల్‌కు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ అంతే వేగంగా రియాక్ష‌న్ ఇవ్వడంపై అటు హ‌స్తం పార్టీతో...పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చర్చ జ‌రుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ప‌రిస్థితులు అస్త‌వ్య‌స్తంగా ఉన్నాయనేది కాదనలేని నిజం. నేత‌ల మధ్య విభేదాలు..గ్రూపు రాజకీయాలు...ఉత్త‌మ్‌ఫై అసంతృప్త రాగం...పీసీసీ చీఫ్‌ను మార్చాలన్న డిమాండ్లు టీ కాంగ్రెస‌్‌లో సర్వసాధారణమే. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తమ్ ముందస్తుకు రెడీ అంటూ రంకెలు వేయడం వెనుక సొంత అజెండా ఉందనే వాదన వినిపిస్తోంది. 

ఉత్త‌మ్ పదవి పదిలమని హైక‌మాండ్ పెద్ద‌లు చెబుతున్నా ఆయన వ‌ర్గీయులు మాత్రం అంత నమ్మడం లేరు. పదవిని నిలుపుకోవడానికే ఉత్త‌మ్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే పీసీసీ చీఫ్ మార్పు జరగడం కష్టమే. కొత్త బాస్ వచ్చి కుదురుకొని ఎన్నికల్ని ఎదుర్కోవడం ఇబ్బంది కాబట్టి ఉత్తమ్‌ను తొలగించే సాహ‌సం హైక‌మాండ్ చేయ‌క‌పోవ‌చ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కేసీఆర్ స‌వాల్ ను స్వీక‌రించారన్న చ‌ర్చ గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

నిజానికి అధికార టీఆర్ఎస్ , కాంగ్రెస్ కూడా వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని ఢంకా భజాయిస్తున్నాయి. సొంతంగా సర్వేలు కూడా చేయించుకొంటున్నాయి. మరి ఆ ధీమాతో ముందస్తుకు సై అంటున్నారా..? లేదంటే.. వైరి పక్షాలను డిఫెన్స్‌లోకి నెట్టే వ్యూహమా..? అదీకాదంటే నిజంగా ముందస్తుకే వెళ్తారో వేచి చూడాలి.

Similar News