తెలంగాణలో నాలుగో విడుత హరితహారం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. సొంత నియోజకవర్గం గజ్వేల్ పట్టణంతో పాటు ములుగు, ప్రజ్ఞాపూర్‌లో మొక్కలు నాటారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాల్గో విడత హరితహారం కార్యక్రమాన్నిసీఎం కేసీఆర్ ప్రారంభించారు. క్యాంపు ఆఫీస్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో గజ్వేల్ బయల్దేరిన సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి, ములుగు, ప్రజ్ఞాపూర్ లో మొక్కలు నాటారు. రాజీవ్ రహదారికి ఇరువైపులా హకీంపేట నుంచి తుర్కపల్లి వరకు ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లా ములుగులో అంజయ్య అనే వ్యక్తి ఇంట్లో కొబ్బరి మొక్క నాటిన సీఎం కేసీఆర్ శిరిగిరిపల్లి వద్ద కొద్దిసేపు ఆగి అటవీ పునరుజ్జీవనం గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజ్ణాపూర్ లో ఎంతో కాలంగా నర్సరీ నిర్వహిస్తూ.. మొక్కలను పంపిణీ చేస్తున్న వారిని అభినందించారు సీఎం కేసీఆర్. వీధుల్లో మొక్కలు నాటుతున్న స్థానికుల దగ్గరకు వెళ్లి పరిశీలించారు.
గజ్వేల్ లోని ఇందిరా పార్కు కూడలిలో సీఎం కేసీఆర్ కదంబ మొక్క నాటిన తర్వాత సైరన్ మోగడంతో పట్టణంలో ఒక లక్ష 16 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంట్లో రోడ్ల వెంట, ఔటర్ రింగ్ రోడ్డుపై.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్యాలయాలు, ప్రార్ధన మందిరాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. తెలంగాణలో అడవులు, పచ్చదనాన్ని రక్షించడం కోసం గ్రీన్ బెటాలియన్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అవసరమైతే పోలీస్‌శాఖ సహకారం కూడా తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటడంలో రాజీలేదని స్పష్టం చేశారు.