తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారా ? సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నేతలు విఫలమవుతున్నారని గులాబీ బాస్ భావిస్తున్నారా ? ఎన్నికలకు ముందే కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా ? గ్రామానికి ఒక ప్రచార సారథిని నియమించేందుకు సిద్ధమవుతున్నారా ?
ముందస్తు ఎన్నికల వార్తలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార వ్యూహానికి పదును పెడుతున్నారు. ప్రతి గ్రామానికి ప్రచార సారథిని సిద్దం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం వంద మంది కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యకర్తలను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో జులై 1 నుంచి శిక్షణ తరగతులకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రజల్లోకి వెళ్లడం లేదన్న భావనలో కేసీఆర్ ఉన్నారు.
67 మంది సభ్యులున్న కార్యవర్గం క్రీయశీలకంగా లేకపోవడం టీఆర్ఎస్ పార్టీకి మైనస్‌గా మారింది. నియోజకవర్గాల వారిగా కార్యదర్శులను, వారిపైన ప్రధాన కార్యదర్శులను నియమించినా పార్టీ పెద్దగా బలపడ లేదు. క్షేత్ర స్థాయిలో పార్టీ వాదనను వినిపించే వారే కరువయ్యారు. పదవులు రాలేదన్న కారణంతో ద్వితియ శ్రేణి నాయకులు పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడం లేదు. పార్టీ నేతలే ఆశించిన మేర పనిచేసి ఉంటే రైతు బంధు, పాస్ పుస్తకాల్లో లక్షల తప్పులు జరిగేవి కావన్న భావనలో కేసీఆర్ ఉన్నారు. అందుకే కార్యకర్తలనే నమ్ముకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికార పార్టీగా మారిన తరవాత పార్టీ యంత్రాంగం బలపడలేదు. కింది స్థాయి క్యాడర్ ఎప్పుడు పార్టీ వెంట ఉంటుందో లేదో తెలియదు. అందుకే ప్రతి గ్రామంలో క్రీయాశీలకంగా ఉన్న ఓ కార్యకర్తను తీర్చిదిద్దాలని కేసీఆర్ నిర్ణయించారు. గ్రామ కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఉన్నా కార్యకర్తలే ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతారు. సంక్షేమ పథకాల లబ్దిదారుల సమాచారం వీరికే తెలుస్తోంది. అందుకే ప్రతి నియోజకవర్గం నుంచి వంద మంది కార్యకర్తలను గుర్తించి తెలంగాణ భవనలో శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్నయించారు.
ఓటర్లను ఎలా ఆకర్షించాలి వారిని పొలింగ్ బూత్‌లోకి తీసుకెల్లి ఎలా ఓట్లు వేయించుకోవాలి సంక్షేమ పథకాలు, అనుభవిస్తున్న ఫలాలు వంటి వివరాలపై నిపుణులతో కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయసం అవుతుందని అంచనా వేస్తున్నారు గులాబి బాస్ కేసీఆర్.