అసెంబ్లీ సమావేశాలపై స్పెషల్ పోకస్ పెట్టారు ఏపి సీఎం చంద్రబాబు. ప్రతిపక్షం రాకపోయినా సొంత పార్టీ ఎమ్మెల్యే లు అసెంబ్లీకి వస్తున్నారా లేదా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే, రోజూ అసెంబ్లీకి హాజరుకావాలనే చంద్రబాబు ఆదేశాలను ఎమ్మెల్యేలు సీరియస్ గా పట్టించుకోవడంలేదు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అసెంబ్లీకి రాకపోయినా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్రను పోషించాలని చంద్రబాబు ఆదేశించారు. తన ఆదేశాలను ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడంతో చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు పసుపు చొక్కాలతో వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి రావాలని టిడిఎల్పీ ఆదేశించినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ఈకార్యక్రమానికి కేవలం పదిహేను మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. పార్టీ ఆదేశాలను పట్టించుకోకపోతే ఎలా అని ఎమ్మెల్యేలపై చంద్రబాబు మండిపడ్డారు.
అసెంబ్లీ రెండో రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేల హాజరు తక్కువగా ఉండడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరి అసెంబ్లీ సమావేశాలను ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏ ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరయ్యారు ఏ ఎమ్మెల్యే సభకు డుమ్మా కొడుతున్నారో ఎప్పటికప్పుడు నివేదిక తయారు చేసి తనకు అందించాలని శాసనసభ, మండలి విప్ లను ఆదేశించారు. ఇకపై ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోతే సహించేదిలేదని చంద్రబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి సీరియస్ కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొంది. సోమవారం నుండి తిరిగి ప్రారంభమైయ్యే సమావేశాలకైనా హాజరై ప్రజా సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తాలని ఎమ్మెల్యేలకు విప్ లు ఆదేశాలు జారీ చేశారు.